రేవంత్ నుంచి బాబు బాకీ వసూల్ చేస్తారా ?
షెడ్యూల్ 9, 10ల్లో పేర్కొన్న ప్రకారం తెలంగాణాలో ఉమ్మడి ఆస్తులు అన్నీ ఉన్నాయి.
ఏపీకి తెలంగాణా బాకీ చాలానే ఉంది. విభజన జరిగి పదేళ్లు గడచినా బాకీలు మాత్రం అలాగే ఉన్నాయి. మరో వైపు ఏపీ అప్పులు చేస్తూ వడ్డీలు కడుతూ నానా తిప్పలు పడుతోంది. షెడ్యూల్ 9, 10ల్లో పేర్కొన్న ప్రకారం తెలంగాణాలో ఉమ్మడి ఆస్తులు అన్నీ ఉన్నాయి. వాటిని ఏపీ తెలంగాణా కలసి పంచుకోవాలి. వాటి విలువను కట్టి ఆ మేరకు ఏపీకి మొత్తం ఇవ్వాలి
ఇది చూస్తే ఏకంగా లక్ష కోట్ల పై మాటగానే ఉంటుందని అంటున్నారు. కేంద్రం చొరవ తీసుకుని ఈ పని ఏనాడో చేయాలి. కానీ మీరూ మీరూ చూసుకోండని వదిలేస్తోంది. పైగా బీజేపీకి తెలంగాణా ఆశలు చాలా ఉన్నాయి. కాబట్టి న్యూట్రల్ గా ఉంటోంది అని అంటున్నారు.
ఇక తెలంగాణా కొత్తగా ఏర్పడిన తరువాత ఏపీ నుంచి విద్యుత్ ని వాడుకున్నారు. దానికి అయిన బాకీ ఆరున్నర వేల కోట్ల రూపాయలుగా ఉంది. కేంద్రం చెబితే ఏపీ తెలంగాణాకు అలా విద్యుతు కొరత లేకుండా సర్దుబాటు చేసింది. కానీ ఆ తరువాత తెలంగాణాను బాకీ చెల్లించమని కేంద్రం మాత్రం ఎపుడూ గట్టిగా అడిగినది లేదు. ఇది చంద్రబాబు తొలి టెర్మ్ లో జరిగిన ముచ్చట. అపుడు తెలంగాణా సీఎం కేసీఆర్. జగన్ వచ్చినా అవి అలాగే ఉన్నాయి.
ఇపుడు చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణా సీఎం అయ్యారు. ఏపీలో చూస్తే చంద్రబాబు సీఎం గా ఉన్నారు. దాంతో ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో తెలంగాణా బాకీలను వరసబెట్టి చంద్రబాబు వసూల్ చేయగలరా అన్న చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి కూడా ఏపీని సాయం చేయడానికి ముందుకు వస్తారా అని కూడా అంతా అనుకుంటున్నారు.
తాజాగా చూస్తే ఏపీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఐదు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఒక అంచనాగా లెక్క చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు సుమారు 5,170 కోట్లు రావాల్సి ఉందని నారాయణ తెలిపారు
అదే విధంగా రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తికాలేదని మంత్రి అన్నారు. ఉమ్మడి ఆస్తుల విభజనతో పాటుగా న్యాయస్థానాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులు పంపిణీ చేసుకోవాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందని నారాయణ గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆస్తుల విభజనకు కేంద్రం పూనుకోవాలని ఆయన కోరుతున్నారు. అయితే కేంద్రం ఎంతవరకూ ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందో అందరికీ తెలుసు.
పైగా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ గురు శిష్యుల బంధంతో ఉంటారు కాబట్టి చొరవ చేసి బాబు రేవంత్ రెడ్డినే ఒప్పించి ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని అంటున్నారు. అది జరిగితే ఏపీకి భారీ ఊరట లభిస్తుందని అంటున్నారు. మరో వైపు చూస్తే జూలై నెలలో బాబు రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమం ద్వారా తొలిసారి భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ఈ అంశాల మీద చర్చిస్తే బాగుంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా అన్ని రకాలుగా చితికిన ఏపీకి న్యాయం అయితే జరగాలనే అంతా అంటున్నారు.