మిలిటెంట్లకు 'ఏఐ'తో ఇజ్రాయెల్ మరణ శాసనం.. నైతికంగా సరైనదేనా?

మొస్సాద్, అల్ బెట్ వంటి అద్భుతమైన నిఘా సంస్థలు ఉన్నా.. మిలిటెంట్ గ్రూప్ నాయకులూ అంతే అప్రమత్తంగా ఉంటారు కదా..?

Update: 2025-02-20 20:30 GMT

పశ్చిమాసియా అంటే ఒక ఇజ్రాయెల్.. అనేక మిలిటెంట్ గ్రూప్ లు.. హమాస్ (గాజా).. హెజ్బొల్లా (లెబనాన్).. హూతీలు (యెమెన్).. హయాత్‌ తహ్రీర్‌ అల్‌ షమ్‌-హెచ్‌టీఎస్‌ (సిరియా).. వీరిలో హమాస్, హెజ్బొల్లాలతో ఇజ్రాయెల్ కు తీవ్రమైన శత్రుత్వం. 2023 అక్టోబరు నుంచి ఈ రెండింటితో యుద్ధం చేస్తోంది. మిలిటెంట్ గ్రూప్ ల అగ్ర నాయకులను మట్టుబెడుతూ.. వాటి కీలక వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వస్తోంది. ఇది ఇజ్రాయెల్ కు ఎలా సాధ్యమైంది..? అనేది ఇంత కాలం పెద్ద ప్రశ్న. మొస్సాద్, అల్ బెట్ వంటి అద్భుతమైన నిఘా సంస్థలు ఉన్నా.. మిలిటెంట్ గ్రూప్ నాయకులూ అంతే అప్రమత్తంగా ఉంటారు కదా..?

మూడో కన్ను..

హమాస్ నేతలు సొరంగాల్లో దాక్కున్నా.. బందీల మధ్య నక్కినా.. కచ్చితంగా గుర్తించి హతమార్చింది ఇజ్రాయెల్. గాజా, లెబనాన్, ఇరాన్‌.. ఇలా ఎక్కడున్నా వదలిపెట్టలేదు. ఈ ఆపరేషన్లలో దానికి కృత్రిమ మేధ (ఏఐ) మూడో కన్నులా ఉపయోగపడింది. ఈ ఏఐ సేవలను అమెరికా టెక్‌ దిగ్గజాలు అందించాయి. కనిపెట్టు.. హతమార్చు.. అనే ఇజ్రాయెల్ సిద్ధాంతానికి అమెరికా సంస్థలు ఇలా సాయం చేశాయనేది ఇప్పుడు సంచలనంగా మారింది.

అయితే, మిలిటెంట్‌ నేతలతో పాటు ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక పౌరులూ చనిపోవడమే వివాదానికి కారణం అవుతోంది.

ఎందుకంటే ‘ఏఐ’ టెక్నాలజీలు మనుషులను పుట్టించి, చంపేందుకు ఉద్దేశించినవి కాదు. దీంతోనే వాటి నైతికత మీద ప్రశ్నలు వస్తున్నాయి. సైన్యాలు యుద్ధంలో తమ అవసరాలకు అనుగుణంగా ఆయుధాల తయారీని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తుంటాయి. కానీ, ఇజ్రాయెల్‌ ఏకంగా యుద్ధ క్షేత్రంలో అమెరికా ఏఐను వాడుకోవడం గమనార్హం.

ఇదే తొలిసారి..

యుద్ధంలో ఇప్పటివరకు అణ్వాయుధాలకు తోడు జీవాయుధాలు వాడారనే అభియోగాలున్నాయి. అయితే, ఏఐ టెక్నాలజీని వాడడం మాత్రం ఇదే తొలిసారి అని సైంటిస్టులు అంటున్నారు. దీంతో అనైతిక, చట్ట వ్యతిరేక విధానాలు మరింత విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్‌ కు ఇజ్రాయెల్‌ సైన్యంతో దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఇతర కంపెనీలతో బందం ఉంది. హమాస్‌ దాడి తర్వాత సొంత సర్వర్ల కెపాసిటీ చాలక.. ఇజ్రాయెల్ సైన్యం టెక్ కంపెనీలపై ఆధారపడింది.

సైనికాధికారుల ప్రజెంటేషన్లలోనూ మైక్రోసాఫ్ట్‌ అజూర్, గూగుల్‌ క్లౌడ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ప్రధాన భాగంగా మారాయట.

ఏఐ టెక్నాలజీని నిఘా వ్యవస్థల్లో ఇజ్రాయెల్‌ బాగా వినియోగించుకుంది. వాటితోనే అనేక ప్రాంతాల్లో గాలింపు చేపట్టింది. కమ్యూనికేషన్ల వ్యవస్థల్లోకి చొరబడింది. శత్రువుల ప్రసంగాలను విశ్లేషించింది. కదలికలను పసిగట్టింది. మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ ఏఐ టెక్నాలజీలను వాడుకుంది. ఉగ్ర నేతలను గుర్తించి హతమార్చింది. అయితే కొన్నిసార్లు ఆపరేషన్లు విఫలమై పౌరులు మరణించారు. డేటాను తప్పుగా ఇవ్వడం, గణాంకాల్లో పొరపాట్లతోనే ఇలా జరిగినట్లు వెల్లడైంది. అందుకే నైతికత మీద విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News