తెలంగాణా సెంటిమెంట్ ఈసారి ఎంత...?
భారత ప్రజలు తెల్ల దొరలతో కొట్లాడి స్వాతంత్రం తీసుకుని వచ్చారని ఆయన అంటూ అదే నీతి తెలంగాణా రాష్ట్ర సాధనకూ వర్తిస్తుంది అని అంటున్నారు.
ఈసారి జరిగే తెలంగాణా ఎన్నికల్లో తెలంగాణా సెంటిమెంట్ ఎంత. ఈ ప్రశ్న అందరిలోనూ చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే సెంటిమెంట్ ని బాగా ప్రయోగిస్తోంది అధికార బీయారెస్. ఎన్నికల ప్రచారం మొదట్లో సెంటిమెంట్ విషయం తీసుకుని రాలేకపోయినా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిన తరువాత మాత్రం అధికార బీయారెస్ నేతలు తెలంగాణా అంటే కేసీయార్ మాత్రమే అంటూ గంభీరమైన ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇవ్వలేదు అని అంటున్నారు. తాము పోరాడి తెచ్చామని చెబుతున్నారు. మంత్రి హరీష్ రావు దీని మీద ఒక వ్యాఖ్య చేశారు. బ్రిటిష్ వారు ఈ దేశానికి స్వాతంత్రం తామే ఇచ్చామని చెబితే ఎలా ఉంటుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. భారత ప్రజలు తెల్ల దొరలతో కొట్లాడి స్వాతంత్రం తీసుకుని వచ్చారని ఆయన అంటూ అదే నీతి తెలంగాణా రాష్ట్ర సాధనకూ వర్తిస్తుంది అని అంటున్నారు.
తెలంగాణా రాష్ట్రం వచ్చింది అంటే కేసీయార్ పోరాటం పటిమ అని అతు కేటీయార్ ఇటు హరీష్ రావు చెబుతున్నారు. ఇక కేసీయార్ అయితే తాను పాల్గొన్న ప్రతీ సభలోనూ ఒక్కటే మాట చెబుతున్నారు. కేసీయార్ చచ్చుడో తెలంగాణా వచ్చుడో అన్న నినాదంతో తాను అమరణ నిరాహార దీక్షకు దిగానని అపుడే తెలంగాణా ప్రకటన చేశారని, ఆయన 2009 డిసెంబర్ 9ని గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకటన తరువాత నాలుగేళ్ళకు కానీ తెలంగాణా రాలేదని కూడా అంటున్నారు.
దాని కంటే ముందు 2004లో తెలంగాణా ఇస్తామని అంటేనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేశామని తీరా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు పదేళ్ల పాటు తెలంగాణా ఊసు మరచిపోయారని కూడా విమర్శిస్తున్నారు. తెలంగాణా తెచ్చాం, పదేళ్ళలో అభివృద్ధి చేశాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇపుడు తెలంగాణాను తీసుకెళ్ళి కాంగ్రెస్ కి అప్పగిద్దామా అని కూడా బీయారెస్ నేతలు ప్రజలను ప్రశ్నిస్తున్నారు
గతంలో కాంగ్రెస్ చాలా కాలం ఉమ్మడి ఏపీలో తెలంగాణాను పాలించిందని, ఆ పార్టీ తెలంగాణాకు ఏమీ చేయలేదని కూడా బీయారెస్ నేతలు చెబుతున్నారు. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణా అంటే బీయారెస్ అని కూడా చెబుతున్నారు. ఇంతలా తెలంగాణా నినాదాన్ని చేస్తూ సెంటిమెంట్ ని పండిస్తూ బీయారెస్ నేతలు జనంలోకి వెళ్తున్నారు.
ఇవన్నీ సరే కానీ 2014లో అయినా తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కదా అన్నది ఒక ప్రశ్న. అంతే కాదు తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ కి అప్పట్లో జనం ఓటేయలేదు, తెచ్చామని అన్నందుకే బీయారెస్ కి వేశారు. ఒకటికి రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. ఇపుడు కాంగ్రెస్ కి ఒక్క చాన్స్ ఇస్తే తప్పేంటి అన్న భావన అయితే ఉంది అని సర్వేలు చెబుతున్నాయి.
తెలంగాణా రాష్ట్రం అన్నది ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు అని జనాలు భావిస్తే మాత్రం రాజకీయ మార్పు కచ్చితంగా వస్తుంది అని అంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ని ఆదరించాలని చూస్తే కనుక ఆ పార్టీ అభివృద్ధి వ్యతిరేకి, తెలంగాణాను కుక్కలు చింపిన విస్తరి చేస్తుంది అన్న బీయారెస్ మాటలను జనాలు అసలు పట్టించుకోరు అని అంటున్నారు. మరో వైపు చూస్తే తెలంగాణా సెంటిమెంట్ కంటే పదేళ్ల కేసీయార్ పాలన మీదనే ఈసారి జనాలు తీర్పు ఇస్తారని అంటున్నారు.
ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే తెలంగాణా జనాలు బీయారెస్ అడుగులో అడుగు వేస్తూ రెండు దశాబ్దాలకు పైగా నడిచారని, ఇపుడు వారు పాలనలో మార్పు కోరుకుంటే మాత్రం అధికార పీఠం కూడా వేరే చేతుల్లోకి వెళ్తుంది అని అంటున్నారు. తెలంగాణా సెంటిమెంట్ ఎంత ఉంది అన్నది మాత్రం ఇప్పటికిపుడు ఎవరూ చెప్పకపోయినా సెంటిమెంట్ల కంటే జనాల ఆకాంక్షలు వేరే విధంగా ఉంటే మాత్రం ఉల్టా సీదా అవుతుంది అని విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.