ప్లీజ్.. ప్లీజ్..ఓటమిభయం పెరిగిపోతోందా ?

పోలింగుకు ఇక ఉన్నది సరిగ్గా వారం రోజులు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఇంటింటికి తిరిగి పనిచేయండి అని పదేపదే చెప్పారు.

Update: 2023-11-23 05:50 GMT

ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ కేటీయార్ లో ఓటమి భయం పెరిగిపోతోందా ? తాజాగా సిరిసిల్లలోని నేతలతో కేటీయార్ మాట్లాడిన ఫోన్ సంభాషణ లీకైంది. అందులో నియోజకవర్గంలోని నేతలతో కేటీయార్ 2.49 నిముషాల పాటు మాట్లాడారు. ఆయన ఏమంటారంటే ప్రతి ఒక్కళ్ళు తామే అభ్యర్ధులమని అనుకుని కష్టపడండని బతిమలాడుకున్నారు. పోలింగుకు ఇక ఉన్నది సరిగ్గా వారం రోజులు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఇంటింటికి తిరిగి పనిచేయండి అని పదేపదే చెప్పారు.

ఆ మండలంలో మెజారిటీ తగ్గుతుంది, ఈ మండలంలో మెజారిటీ తగ్గుతుందని మీరే ప్రచారం చేస్తున్నారంటు మండిపోయారు. అలాంటి ప్రచారాలు చేసి జనాల్లో గందరగోళం చేయద్దన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కేకే మహేందర్ రెడ్డి తిరుగుతున్న విషయాన్ని పక్కనపెట్టేయండన్నారు. ప్రత్యర్ధి అన్నాక తిరుగుతారు, పదిమందిని కలవటం చాలా సహజమే కదాని అని నేతలను ఎదురు ప్రశ్నించారు. మండలాల్లో బీఆర్ఎస్ కు మెజారిటి తగ్గిపోతోందనే ప్రచారాన్ని ఎవరు చేయద్దని చెప్పారు.

గతంలో లాగ కాకుండా ఇక నుండి ప్రతి వారం రెండుసార్లు తానే సిరిసిల్లకు వస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏమి కావాలన్నా హామీలిచ్చేయండని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను రెగ్యులర్ గా నియోజకవర్గంలో పర్యటిస్తానని, అన్నీ వర్గాల వాళ్ళని కలుస్తానని తన తరపున హామీ ఇవ్వండన్నారు. దేశం మొత్తం సిరిసిల్ల నియోజకవర్గం వైపు చూస్తున్నదని హెచ్చరించారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఏది అడిగితే అవన్నీ ఇప్పిస్తామని హామీలిచ్చేయమన్నారు. బూత్ లెవల్, గ్రామాలు ఎక్కడి వాళ్ళు అక్కడే కష్టపడి పనిచేయాలని గట్టిగా చెప్పారు.

కేటీయార్ మాటలు విన్నతర్వాత నేతలు, క్యాడర్ కూడా సరిగా పనిచేయటం లేదన్న విషయం అర్ధమవుతోంది. కేటీయార్ బాగా వెనకబడిన విషయం స్పష్టమైంది. ప్రచారం జరుగుతున్నట్లుగా కాంగ్రెస్ అభ్యర్ధి కేకే మహేందర్ రెడ్డికి జనాల్లో బాగా సానుకూలత పెరుగుతున్నది నిజమే అన్న విషయం తెలుస్తోంది. కేటీయార్లో ఓటమిభయం పెరుగుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి ఉదాహరణ ఏమిటంటే నేతలకు ఫోన్లు చేసి పనిచేయండి, గెలిపించండని బతిమలాడుకోవటమే.

Tags:    

Similar News