జగన్ మాట వినని మాజీ ఎమ్మెల్యే... ఝలక్ ఇస్తారా ?

ఏకంగా పది అసెంబ్లీ సీట్లకు గానూ నాలుగు మాత్రమే వైసీపీకి దక్కాయీ అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు

Update: 2024-10-31 16:25 GMT

జగన్ సొంత జిల్లాలోనే ఝలక్ తప్పదా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే అదే నిజం అయ్యేలా ఉంది అని అంటున్నారు. జగన్ మూడు రోజుల పర్యటనను పులివెందులలో నిర్వహించారు. ఇటీవల ఎన్నికల్లో జగన్ సొంత జిల్లా కడప కూడా దారుణమైన ఫలితాలను ఇచ్చింది. ఏకంగా పది అసెంబ్లీ సీట్లకు గానూ నాలుగు మాత్రమే వైసీపీకి దక్కాయీ అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఈ క్రమంలో జగన్ పార్టీని సొంత జిల్లా నుంచే తిరిగి పుంజుకునేలా చేయాలని తాజా టూర్ పెట్టుకున్నారు. కడప జిల్లాలో జమ్మలమడుగు వైసీపీకి తలనొప్పిగా మారింది అని అంటున్నారు. మిగిలిన చోట్ల పార్టీకి ఇంచార్జుల గొడవ లేదు. కానీ వైసీపీకి బలమైన స్థావరంగా ఉన్న జమ్మలమడుగులో మాత్రం రెండు వర్గాలు కొనసాగుతున్నాయి.

ఇద్దరూ బలమైన నేతలే. ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటాపోటీగా కార్యక్రమాలు నిరహిస్తున్నారు. దాంతో పార్టీ రెండుగా చీలిపోయింది. 2019 నుంచి 2024 వరకూ ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పనిచేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి ఒక వైపు మరో వైపు చూస్తే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీగా పదవిని అందుకున్న రామ సుబ్బారెడ్డి కూడా జమ్మలమడుగులో బలంగా ఉన్నారు.

దీంతో ఇద్దరూ ఎవరూ తగ్గేదిలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో చూస్తే వైసీపీకి ఇది భరించరాని విషయంగా మారుతోంది. కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రవీంద్ర నాధ్ రెడ్డి కానీ కడప ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డి కానీ నచ్చచెప్పినా ఈ వర్గ పోరు అయితే అగేది లేదు అన్నట్లుగానే ఉంది.

దాంతో ఇపుడు నేరుగా జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన తన పర్యటనలో భాగంగా ప్రధానంగా జమ్మలమడుగు మీదనే ఫోకస్ పెట్టారు. రామ సుబ్బారెడ్డిని సుధీర్ రెడ్డిని పిలిచి రాజీ కుదుర్చే యత్నాలు చేశారు. మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలలో చెరి మూడేసి తీసుకోమని ఆయన ప్రతిపాదించారు.

అయితే ఆ ప్రతిపాదనకు సుధీర్ రెడ్డి అయితే అసలు అంగీకరించలేదు అని అంటున్నారు. ఆయన అలిగి దూరంగా ఉంటున్నారు. మరో వైపు చూస్తే అధినాయకత్వం చూపు బలమైన నేతగా ఉన్న రామ సుబ్బారెడ్డి మీదనే ఉంది అని అంటున్నారు. ఆయనకు నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తేనే బీజేపీ నుంచి అక్కడ గెలిచిన ఆదినారాయణరెడ్డిని ధీటుగా ఎదుర్కొంటారు అని అంటున్నారు.

దాంతో సుధీర్ రెడ్డి రాజీకు రాకపోతే వైసీపీ కూడా లైట్ తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక సుధీర్ రెడ్డి దీని మీద ఏమంటారు అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన అయితే పూర్తి అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు.

తనకు మొత్తం జమ్మలమడుగు బాధ్యతలు అప్పగిస్తేనే చేస్తాను అని ఆయన అంటున్నారు. అదే సమయంలో రామ సుబ్బారెడ్డి వైపు అధినాయకత్వం మొగ్గు ఉందని ఆయన అనుమానిస్తున్నారు. దాంతో ఆయన తనదైన డెసిషన్ తీసుకుని ఝలక్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అదే కనుక జరిగితే కడప జిల్లాలో జగన్ కి ఒక బలమైన నేత షాక్ ఇచ్చినట్లు అవుతుంది అని అంటున్నారు మరి సుధీర్ రెడ్డి విషయంలో వైసీపీ ఏమి చేస్తుంది అన్నది కూడా ఆసక్తికరమే అని అంటున్నారు.

Tags:    

Similar News