పులివెందుల మునిసిపాలిటీ.. ఇప్పుడిదే చర్చ..!
ఏపీ మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల చుట్టూ ఇప్పుడు రాజకీయాలు ముసురుకున్నాయి.
ఏపీ మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల చుట్టూ ఇప్పుడు రాజకీయాలు ముసురుకున్నాయి. తాజాగా జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు. మూడురోజుల పాటు అక్కడే ఉండనున్నారు. దీనిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రజలను కలిసి.. వారి నుంచివినతి పత్రాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో జగన్ ఒకరిద్దరి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
ఈ కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. మరో కీలకమైన విషయం ఆసక్తిగా మారింది. అదే పులివెందు ల మునిసిపాలిటీ. ఇటీవల కాలంలో దీని చుట్టూ రాజకీయాలు చోటు చేసుకున్నాయి. పులివెందుల మునిసిపాలిటీ కూడా వైసీపీ నుంచి చేజారుతోందన్నది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. ఇక్కడి వైసీపీ నాయకులు కొందరు టీడీపికి టచ్‌లోకి వెళ్లారన్నది ప్రధాన విషయం. టీడీపీ సీనియర్ నాయకులు.. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన మంత్రులు.. పులివెందులపై కన్నేశారన్నది వాస్తవం.
ప్రస్తుతం చిత్తూరు, విశాఖల మాదిరిగానే.. పులివెందులలోనూ కూటమి పార్టీల జెండా ఎగురవేయాలన్నది లక్ష్యం. ఇది నెరవేరితే.. వైసీపీని మానసికంగానేకాకుండా.. జగన్‌ను మరింతగా ఇరుకున పడేసినట్టు అవు తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు కొందరు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. పులివెందుల మునిసిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్‌లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఇక్కడ క్యాంపు రాజకీయాలు.. విందు రాజకీయాలు అత్యంత గోప్యంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా.. వైసీపీ నాయకులు ఇక్కడ జంప్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్ర మంలోనే జగన్ నేరుగా రంగంలోకి దిగినట్టు సమాచారం. ప్రస్తుతం పులివెందుల పర్యటన వెనుక పులి వెందుల మునిసిపాలిటీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలపై ఆయన నేరుగా స్పందించనున్నారని.. నాయకులు చేజారకుండా చూసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారన్నది చర్చ. ఇలా.. ఎందుకు చేయాల్సి వస్తోందంటే.. జగన్ హయాంలో ఇక్కడి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు చేశారు. అయితే.. వారికి బిల్లులు చెల్లించలేదు.
వీరిలో మునిసిపల్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. ఇటీవల వారికి ప్రభుత్వం రూపాయి బాకీ లేకుండా మొత్తం బిల్లులు ఇచ్చేసింది. అయితే.. దీనివెనుక అసలు వ్యూహం జంపింగులేనని తెలుస్తోంది. అంటే.. పెండింగు బిల్లులు చెల్లించేశాక.. వారంతా పార్టీ జంప్ చేస్తామన్న `ఒప్పందం` జరిగిందన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. బిల్లులు చెల్లించేసిన రెండు రోజుల్లోనే జగన్ అక్కడకు వెళ్తుండడాన్ని బట్టి ఈ వివాదానికి బలం చేకూరుతోంది.