జగన్ రెడీ... క్యాడర్ రెడీనా ?

అయితే జగన్ ముహూర్తం పెట్టేశారు. కానీ క్యాడర్ రెడీగా ఉందా అన్నదే చర్చ గా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పూర్తిగా డీమోరలైజ్ అయి ఉంది.

Update: 2024-12-01 23:30 GMT

జగన్ దాదాపు ఆరు నెలల తరువాత జనంలోకి రావాలని చూస్తున్నారు. దీని కోసం ఆయన మంచి ముహూర్తమే పెట్టుకున్నారు. 2025 సంక్రాంతి పండుగ తరువాత జిల్లాల పర్యటన చేస్తాను అని జగన్ తాడేపల్లిలోని పార్టీ కేడర్ మీటింగులో ప్రకటించారు. ప్రతీ జిల్లాలో రెండు రోజులు పాటు ఉంటాను అంటున్నారు. అలా ఏకంగా 50 రోజుల పాటు ఏపీలోని 26 జిల్లాలను చుట్టి రావాలని జగన్ చూస్తున్నారు. అంతే కాదు క్యాడర్ కి తాను అండగా ఉంటున్నాను అన్న సంకేతాలు పంపించాలని కూడా చూస్తున్నారు.

అయితే జగన్ ముహూర్తం పెట్టేశారు. కానీ క్యాడర్ రెడీగా ఉందా అన్నదే చర్చ గా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ క్యాడర్ పూర్తిగా డీమోరలైజ్ అయి ఉంది. వారి మీద వరస పెట్టి కేసులు పడుతున్నాయి. అంతే కాదు కూటమి అధికారంలో ఉంది. దాంతో గ్రామాలలో మండలాలలో వారిదే ఆధిపత్యం గా ఉంది. దాంతో వైసీపీ క్యాడర్ ఫుల్ సైలెన్స్ మోడ్ లో ఉంది. ఎందుకొచ్చిన తంటా అన్నట్లుగా ఉన్నారు

దీని కంటే ముందు చూస్తే 2019 నుంచి కూడా వైసీపీ క్యాడర్ లో మునుపటి ఉత్సాహం లేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్న ఆనందం వారిలో ఎక్కడా కనిపించలేదు. వైసీపీ అధినాయకత్వం కూడా వారిని పూర్తిగా పక్కకు పెట్టేసింది. దాంతో వారు పూర్తి నిరాశ నీడలోకి వెళ్ళిపోయారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది

ఇపుడు చూస్తే ఆరు నెలల కూటమి పాలనలో వైసీపీ క్యాడర్ బాగా టార్గెట్ అయ్యారు. ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వారు తన సొంత బిజినెస్ తో బిజీగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు కూడా వారు చేరదీసింది లేదు. ఇపుడు అసలు గాలికి వదిలేశారు. దాంతో వైసీపీ క్యాడర్ నీరసించి పోయి ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎందుకు ఎదురెళ్లడం అన్న ధోరణి కూడా ఏర్పడింది.

గట్టిగా చెప్పాలీ అంటే వారిలో ఫైర్ అన్నది లేకుండా పోయింది. దానికి కారణం వైసీపీ అధినాయకత్వం స్వయంకృతం అని అంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్ జిల్లాల టూర్ కి వస్తే జెండా ఎత్తే వారు ఎవరు వెంట నడిచే వారు ఎవరు అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.

అలాగే చాలా చోట్ల అసెంబ్లీలకు ఇంచార్జిలను నియమించింది. అయితే వారిలో కూడా అత్యధిక శాతం యాక్టివ్ గా లేరు అని అంటున్నారు. మరి నాయకులలోనే జోష్ లేనపుడు క్యాడర్ లో ఎలా వస్తుంది అని అంటున్నారు. ఇక సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్న కేసులు కానీ గ్రామాలలో టార్గెట్ చేసి మరీ వైసీపీ వారి మీద జరుగుతున్న దాడులు కానీ వైసీపీ నేతల నుంచి ఏ మాత్రం సహకారం అందకపోవడంతో క్యాడర్ అయితే పూర్తిగా డీలా పడింది అని అంటున్నారు

ఈ నేపథ్యంలో జగన్ జిల్లాల టూర్లకు వస్తే మునుపటి సందడి కనిపిస్తుందా అన్నది అయితే చర్చగా ఉంది. జగన్ అంటే జన సందోహం అన్న మాట ఉంది. ఆయన ఎన్నికల్లో గెలవవచ్చు లేదా ఓటమి పాలు కావచ్చు. కానీ జనం మాత్రం ఆయనకు ఎపుడూ వెంట ఉంటూ వస్తున్నారు. అలాగే క్యాడర్ కూడా జగన్ తో గతంలో పెద్ద ఎత్తున ఉంటూ వచ్చింది.

అలాంటిది ఇపుడు క్యాడర్ కనుక అనుకున్నంత స్థాయిలో కనిపించకపోతే అది ఇబ్బంది అవుతుందేమో అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో జగన్ అంటే అభిమానం ఉన్న వారు కూడా జనంలోకి వస్తే అధికార పార్టీకి టార్గెట్ అవుతామన్న బెంగతో ఉంటారు అని అంటున్నారు. దాంతో జగన్ మరి కొంత కాలం వేచి చూడాల్సిందే అంటున్నారు. సమీక్షలు అన్నీ పార్టీ ఆఫీసులో నిర్వహిస్తూ పోతేనే మంచిది అని అంటున్నారు.

ఇంకా టీడీపీ కూటమి మీద ఆశలు జనంలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు అసంతృప్తి అయితే వైసీపీ అధినాయకత్వం ఊహిస్తున్నట్లుగా లేదని అంటున్నారు. జనం మూడ్ మారినపుడే క్యాడర్ ధైర్యంగా రోడ్డెక్కుతుందని అంటున్నారు. చంద్రబాబు కూడా 2019లో ఓటమి తరువాత కొంతకాలం పార్టీ ఆఫీసులోనే మీటింగ్స్ పెట్టి ఆ తరువాత జనంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి జగన్ రెడీ అంటున్నారు, క్యాడర్ రెడీనా అంటే చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News