తెలంగాణలో వైసీపీ ఎంట్రీపై జగన్ కీలక వ్యాఖ్యలు!

అవును... తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయంపై జగన్ తాజాగా స్పందించారు.

Update: 2024-05-09 11:30 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో రీజనల్ పార్టీ అయిన బీఆరెస్స్ ప్రభుత్వం పోయి, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా రాష్ట్రాభివృద్ధిపై రీజనల్ పార్టీలకు ఉన్న కాంక్ష.. జాతీయ పార్టీలకు ఉండదని అంటుంటారు. కారణం.. వారికి ఇదొక్కటే రాష్ట్రం కాదు కాబట్టి! దీంతో.. చాలా రాష్ట్రాల్లో రీజనల్ పార్టీలే రాజ్యమేలుతుంటాయి!

ఈ క్రమంలో.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి, అనంతరం సుమారు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆరెస్స్ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో లేదు. ఈ సమయంలో తెలంగాణలో ఏపీలోని అధికార వైసీపీ విస్తరణ చేస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ తెరపైకి వచ్చింది. 2019 ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో అంత బలమైన రీజనల్ పార్టీ లేదనే చెప్పాలి!

ఈ నేపథ్యంలో... వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న సామాజిక వర్గాలతోపాటు.. సామాన్య ప్రజానికం తెలంగాణలో కూడా అధిక సంఖ్యలో ఉండటంతో పాటు.. 2019 - 24 సమయంలో జగన్ పాలనను కాస్త దూరం నుంచి అయినా తెలంగాణా ప్రజానికం స్పష్టంగా చూసిందని చెబుతున్నారు. ఈ సమయంలో... తాజాగా జగన్ కు ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి జగన్ ఆసక్తికరంగా స్పందించారు.

అవును... తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయంపై జగన్ తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా... తన వైసీపీ ని ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో విస్తరించే ఆలోచనలో తాను లేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... తాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మాత్రమే దృష్టి సారించినట్లు జగన్ తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం విశాఖ పట్నంలోనే ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు.

ఇదే సమయంలో... తన జీవితం చాలా చిన్నదని చెప్పిన జగన్... ఈ జీవితకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరకాలం మిగిలిపోయేలా సంక్షేమం, అభివృద్ది చేసి జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటే చాలని అన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో చేయాలన్న ఉద్దేశం తనకు లేదని.. ఉన్నంత కాలం మాత్రం అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News