చంద్రబాబుని తక్కువ అంచనా వేస్తున్న జగన్ ?

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుని తక్కువ అంచనా వేస్తున్నారు అని అంటున్నారు

Update: 2024-08-13 17:30 GMT

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుని తక్కువ అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఎపుడూ బాబుని లైట్ తీసుకుంటారు. అందుకే 2014, 2024లలో ఓటములు వైసీపీ ఎదుర్కోంది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ వేరు. ఆయన చదివిన రాజకీయ పుస్తకాలు ఆయన స్కూలూ వేరు.

ఆయన రాజకీయంగా తలపండిన నాయకుడు. బాబు డిక్షనరీలో రాజకీయ ప్రత్యర్ధులు ఎవరూ ఉండరు. ఆయన ఎప్పుడైనా ఎవరితోనైనా నేస్తం కలుపుకోగలరు. రాజకీయాల్లో కావాల్సింది కూడా అదే. జగన్ లో లేనిది కూడా అదే.

ఇదిలా ఉండగా తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో విశాఖ జిల్లా పార్టీ స్థానిక ప్రాజా ప్రతినిధులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా చర్చకు తెర తీసేలా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేవలం రెండున్నర నెలలలోనే తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందని జగన్ తేల్చేశారు.

బాబుని ప్రజలు నచ్చుకోవడం లేదు అన్నారు. వైసీపీకి మంచి రోజులే అని చెప్పారు. చీకటి వెనక వెలుగులా మళ్లీ వైసీపీకి విజయాలు తధ్యమని కూడా జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేతగా ఆయన సొంత పార్టీ మీద ఆత్మ విశ్వాసంతో ఏమి మాట్లాడినా ఎవరూ తప్పు పట్టేది ఉండదు. ఏ రాజకీయ నేత అయినా తామే గెలుస్తామని గెలవాలని కోరుకుంటారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ చెబుతున్నారు. ఎలా అంటే ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చుకోలేదని జగన్ భావిస్తున్నారు. అందువల్ల ప్రతీ ఇంటిలో టీడీపీ పట్ల వ్యతిరేకత ఉందని ఆయన విశ్లేషించారు. అదే సమయంలో అయిదేళ్ళుగా వైసీపీ చేసిన సంక్షేమ కార్యక్రమల పట్ల ప్రజలలో ఆ మంచి అలాగే ఉంది అని అంటున్నారు.

చంద్రబాబు మోసపూరిత హామీలతోనే ప్రజలు ఆయనను నమ్మి ఓట్లేశారు కానీ వైసీపీని వద్దని ఎంత మాత్రం కాదని ఆయన మార్క్ విశ్లేషణ వినిపిస్తున్నారు. వైసీపీ వరకూ చూస్తే సంక్షేమ పధకాలు అమలు చేసింది. ఈ విషయంలో మార్కులు పడవచ్చు. కానీ అభివృద్ధి లేమి ఇతర అంశాల మీద జనంలో వ్యతిరేకత ఉందని అది పెల్లుబికి వైసీపీ ఓటమి పాలు అయింది అని జగన్ గ్రహించలేకపోతున్నారు అని అంటున్నారు.

అలాగే చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలు చేయకపోతే ఆయన పట్ల వ్యతిరేకత ఉంటుందని ఆయన అంటున్నారు. అంటే జగన్ ఆలోచనలలో చూస్తే కనుక సంక్షేమం ఒక్కటే వైసీపీని ఓడించి టీడీపీని గెలిపించింది అని నమ్ముతున్నారు. కానీ రాష్ట్రం అంటే కేవలం సంక్షేమం కాదని ఆయన తెలుసుకోవడం లేదని అంటున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి రెండు నెలలు మాత్రమే అయింది. చేతిలో ఇంకా 58 నెలల అధికారం ఉంది. చంద్రబాబు సంక్షేమ పధకాలు ఆపుతున్నట్లుగా ఎక్కడా చెప్పలేదు. ఆయన మొదటి ఏడాదిలో అమలు చేయకపోయినా ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి. ఈ మధ్యలో ఎపుడు అమలు చేసినా జనాలు చంద్రబాబుని కాదని వైసీపీ వైపు రారు కదా అన్న చర్చ ఉంది.

ఆ మాటకు వస్తే అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి వైఎస్ జగన్ పధకాలు అమలు చేసినా జనాలు ఓట్లు వేసి మళ్లీ గెలిపించలేదు కదా అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీకి అయినా చివరి రెండేళ్ళూ ముఖ్యం. అందువల్ల ఈ మూడేళ్ళు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి తద్వారా ఆర్ధికంగా రాష్ట్రం నిలదొక్కుకునేలా చేసి అపుడు సంక్షేమ పధకాలు చంద్రబాబు అమలు చేసి ఎన్నికలకు వెళ్తే వైసీపీకి జనాలకు చెప్పుకోవడానికి ఏమి ఉంటుంది అని కూడా ప్రశ్నలు ఉన్నాయి.

ఏది ఏమైనా టీడీపీని చంద్రబాబుని తక్కువ అంచనా వేయకూడదని అంటున్నారు. పోనీ జగన్ భావిస్తున్నట్లుగా సంక్షేమ లబ్దిదారులలో వ్యతిరేకత ఉందని అనుకున్నా అభివృద్ధిని కోరుకునే వర్గాలు కూడా వారికి ధీటుగానే ఉన్నారని వారంతా టీడీపీకి అండగా నిలిస్తే అపుడు వైసీపీకి 2029లో చెప్పుకోవడానికి ఏ నినాదం ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుని లైట్ తీసుకోకుండా వైసీపీ తనను తాను దిద్దుకుంటూ ముందుకు వెళ్తేనే మేలు జరుగుతుందని సూచనలు వస్తున్నాయి.

Tags:    

Similar News