జగన్ లో ఎవరున్నారు? మంచి వ్యాపారస్తుడా? రాజకీయ నేతా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అత్యుత్తమ వ్యాపారస్తుడు ఉన్నాడా? పాలకుడు ఉన్నాడా? అంటే.. ఎక్కువ మంది రాజకీయ నేతనే ఉన్నారన్న మాటను చెబుతారు

Update: 2024-07-05 17:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అత్యుత్తమ వ్యాపారస్తుడు ఉన్నాడా? పాలకుడు ఉన్నాడా? అంటే.. ఎక్కువ మంది రాజకీయ నేతనే ఉన్నారన్న మాటను చెబుతారు. అదే టైంలో ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసినోళ్లు మాత్రం ఆయనలో తెలివైన వ్యాపారస్తుడు ఉన్నట్లుగా వ్యాఖ్యానిస్తారు. ఒక ప్రముఖుడి మీద ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలు ఉండటం ఏమిటి చెప్మా అన్న సందేహం కలుగక మానదు. తరచి చూస్తే.. జగన్ గురించి ఎక్కువగా తెలిసిన వారు తక్కువగా.. తెలియని వారే ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాలి. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారెవరూ మాట వరసకు కూడా జగన్ మీద పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడరు. ఎందుకంత అభిమానం అంటే.. వారు సైతం సూటిగా సమాధానాలు చెప్పలేకపోతారు.

నిజానికి చంద్రబాబుకు.. జగన్ కు ఉన్న పెద్ద తేడా ఏమంటే.. చంద్రబాబుకు చుట్టూ ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే చాలామంది నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో ఆయన గురించి మాట జారేందుకు పెద్దగా వెనుకాడరు. దీనికి కారణం.. ఒకవేళ తాము మాట జారినట్లు తెలిసినా.. చూసిచూడనట్లుగా బాబు వ్యవహరిస్తారన్న భావనే. అదే సమయంలో జగన్ విషయంలో మాత్రం ఆ ఆలోచనకే వణుకుతారు. ఎందుకుంటే.. తన పరోక్షంలో తన గురించి చేసే తప్పుడు వ్యాఖ్యలకు వారు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉండటంతో.. పల్లెత్తు మాట అనేందుకు సైతం సాహసించని వైనం కనిపిస్తుంది.

ఈ కారణంతోనే ఆయన తప్పుల్ని ఎత్తి చూపే ధైర్యం ఎవరూ చేయరు. ఆయనకు సలహాలు ఇచ్చే సాహసానికి ఎవరూ ముందుకు రారు. నిజానికి ఇదే ఆయనకు ప్లస్ గా అభివర్ణిస్తారు కానీ.. తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి మూలకారణం కూడా ఇదేనన్న విషయాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఇంతకూ జగన్ మంచి వ్యాపారస్తుడా? మంచి రాజకీయ నాయకుడా? అన్న ప్రశ్నను మరోసారి రిపీట్ చేసుకుంటే.. కొన్ని అంశాల్ని ప్రస్తావించాల్సి వస్తుంది. అదంతా చదివిన తర్వాత ఎవరికి వారికి విషయం ఇట్టే అర్థమైపోతుంది.

మంచి వ్యాపారస్తుడు అంటే.. తన వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ పోవటంతో పాటు.. తన ఉద్యోగుల్ని బాగా చూసుకోవటం. జగన్ విషయానికి వస్తే తన వ్యాపారాలను పెంచుకుంటూ పోవటం మాత్రమే కనిపిస్తుంది. ఒక వ్యాపారవేత్తగా అదేమీ తప్పు కాదు. కాకుంటే.. ప్రజా నాయకుడిగా.. ఆయన చెప్పే సంక్షేమం తన సంస్థల్లో పని చేసే ఉద్యోగుల విషయంలో కనీస స్థాయిలో ప్రదర్శించకపోవటమే చిత్రమైన అంశం. వ్యాపారస్తుడిగా జగన్ ఎంత సక్సెస్ ఫుల్ అన్న విషయాన్నిప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆయన వ్యాపారస్తుడిగా ఎదగటానికి సాయపడ్డ వారంతా తర్వాతి కాలంలో అనూహ్యమైన కష్టాల్ని ఎదుర్కోవటం కనిపిస్తుంది. వ్యాపారస్తుడిగా ఆయన ట్రాక్ రికార్డు ఇలా ఉంటే.. ప్రజానాయకుడిగా ఆయనలో మరిన్ని కోణాలు కనిపిస్తాయి.

జగన్ రాజకీయ ప్రయాణం తెరిచిన పుస్తకం. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అనూహ్యంగా చేపట్టిన ఆయన.. పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ వడివడిగా ఎదిగారు. ఆయనలోని కొన్ని కోణాల్ని అస్సలు ఊహించలేం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో తన తండ్రి నుంచి వస్తున్న శత్రుత్వాన్ని జగన్ కొనసాగించారు. కానీ.. రాజకీయంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్న వేళ.. అనూహ్యంగా ఆయనకు స్నేహహస్తం చాటటంతో పాటు.. ఫిలింసిటీకి వెళ్లి మరీ భేటీ అయి వచ్చారు. కట్ చేస్తే.. కొన్ని సంవత్సరాల తర్వాత అదే రామోజీరావుకు అరెస్టు భయాన్ని చూపించటమే కాదు.. ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లి కొన్నాళ్లు ఉండేలా చేయగలిగారు.

కఠినంగా ఉండటం.. అంతలోనే తగ్గటం.. కొంతకాలానికే అందుకు విరుద్ధమైన తీరును ప్రదర్శించటం జగన్ లో కనిపించే గుణాలు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. వైఎస్ రాజకీయ వారసుడిగా జగన్ ను చెప్పుకున్నప్పుడు.. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కేవీపీ కానీ.. ముఖ్య సహాయకుడు సూరీడు కానీ.. ఉండవల్లిలాంటి వాళ్లు కానీ జగన్ వెంట ఎందుకు లేరన్నది అర్థం కాని ప్రశ్న.

అదే సమయంలో మరికొందరు మాత్రం వీర విధేయులుగా ఉండటం కనిపిస్తుంది. రాజకీయ నాయకుడు కాస్తా.. పాలకుడిగా మారిన జగన్.. ఐదేళ్ల తన పాలనలో ఏపీ ముఖచిత్రాన్ని ఏ విధంగా మార్చారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాన్ని వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి తీసుకురావటంలో ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. తన ఐదేళ్ల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రభావం కనీసం పాతికేళ్ల వరకు ఏపీ రాజకీయాల్లో ఉంటుందని చెప్పాలి. సంక్షేమం పేరుతో ఆయన చేపట్టిన పథకాలు.. రాజకీయం పేరుతో తన ప్రత్యర్థుల విషయంలో వ్యవహరించిన తీరు.. పాలకుడిగా ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండాల్సిన ఆయన.. పరదాలకు ఒక వైపు మాత్రమే ఎందుకు ఉండాల్సి వచ్చిందన్నది ప్రశ్న.

పాలకుడిగా మారటానికి ముందు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండి.. వారి కష్ట నష్టాల్ని తెలుసుకోవటం ద్వారా అధికారాన్ని చేపట్టిన జగన్.. ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రజలను తన దగ్గరకు కూడా రానివ్వకుండా ఎందుకు ఉంచారన్నది అర్థం కాదు. రాజకీయంగా ఆయన సాధించిన విజయ పరంపరను తక్కువ చేసి చూడటానికి లేదు. చాలా స్వల్ప వ్యవధిలోనే ఆయన ఎన్నో రికార్డుల్ని క్రియేట్ చేయగలిగారు. చరిత్రను క్రియేట్ చేయగలిగారు.తన తండ్రికి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవటానికి దశాబ్దాల తరబడి పోరాడాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా జగన్ మాత్రంచాలా స్వల్ప వ్యవధిలోనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ.. తన సొంతమైన పవర్ పగ్గాల్ని మరింతకాలం తన దగ్గర ఉంచుకోలేకపోయారు. ఆ విషయంలో ఆయనకు తగిలిన ఎదురుదెబ్బ ఆయన తీరును మారుస్తుందా? లేక మరింత కొత్తగా మారుస్తుందా? అన్నది కాలమే చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News