జగన్ ట్వీట్...అయిదేళ్ళూ వాడుకోవచ్చు

వైసీపీ అధినేత జగన్ తాజాగా ఎక్స్ వేదికగా చేసిన ఒక ట్వీట్ ఏపీ రాజకీయాల్లో మంట పుట్టిస్తోంది

Update: 2024-06-18 15:19 GMT

వైసీపీ అధినేత జగన్ తాజాగా ఎక్స్ వేదికగా చేసిన ఒక ట్వీట్ ఏపీ రాజకీయాల్లో మంట పుట్టిస్తోంది. జగన్ డబుల్ స్టాండర్డ్ విధానాలకు ఇది నిదర్శనం అని అంటున్నారు. 2019లో జగన్ ఈవీఎల గురించి మాట్లాడుతూ అవి చాలా మంచివంటూ చేసిన వ్యాఖ్యలను టీడీపీ సోషల్ మీడియాలో పెడుతోంది. బీజేపీ కూడా మీమ్స్ పెట్టి జగన్ మీద సెటైర్లు వేస్తోంది. టీడీపీ నేతలు అంతా జగన్ చేసిన ట్వీట్ మీద మండి పడుతున్నారు.

గెలిస్తే మీ గొప్ప ఓడితే ఈవీఎంల తప్పా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ జగన్ పెట్టిన ట్వీట్ ని ఒకసారి చూస్తే కనుక ఈవీఎంల పనితీరు మీదనే సందేహం వ్యక్తం చేస్తూ ట్వీట్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ పేపర్ ని వాడుతున్నారు అని జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంటే ఇండైరెక్ట్ గా క్యాడర్ కి వైసీపీ ఈవీఎంల వల్లనే ఓటమి పాలు అయిందని జగన్ హింట్ ఇచ్చారు అని అంటున్నారు. ఇదే విషయాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలాని జగన్ చెబుతున్నట్లుగా ఉంది అని అంటున్నారు.

అయితే క్యాడర్ ఇపుడు వైసీపీ అధినాయకత్వానికి అవసరం అయినా వారు ఈ సమయంలో ఎందుకు పనిచేస్తారు అని అంటున్నారు. వాలంటీర్లను నెత్తిన పెట్టుకుని క్యాడర్ ని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు అని అంటున్నారు. ఇపుడు క్యాడర్ ఎందుకు వైసీపీ కోసం పనిచేయాలన్న ప్రశ్న వస్తోంది. అదే విధంగా క్యాడర్ కూడా ఈవీఎంల వల్లనే ఓటమి పాలు అయ్యామని చెప్పడానికి ప్రాపగాండా చేయడానికి సిద్ధంగా లేరు అని అంటున్నారు.

ఇక జగన్ ట్వీట్ కి టీడీపీ సోషల్ మీడియాలో కౌంటర్ వేసింది. గతంలో ఈవీఎంల గురించి గొప్పగా పొగిడి ఇపుడు ఏంటి అని కూడా టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే ఈవీఎంల మీద జగన్ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అవుతున్నాయి.

Read more!

ఆయన అన్నదేంటంటే న్యాయం జరగడం మాత్రమే కాదు, జరిగినట్లుగా కూడా కనిపించాలి, అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా బలంగా కనిపించాలి. దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగించబడుతున్నాయి, ఈవీఎంలతో కాదు, మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. అంటూ జగన్ ట్వీట్ చేశారు.

దీని మీద మాత్రం జగన్ కి కౌంటర్లే కౌంటర్లు వస్తున్నాయి. ఈ రోజున చూస్తే బ్యాలెట్ పేపర్ వ్యవస్థ నుంచి చాలా ముందుకు వచ్చేసింది దేశం. ఈవీఎంల వల్ల తక్కువ ఖర్చుతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు కూడా తొందరగా వస్తున్నాయి. పైగా గతంలో బ్యాలెట్ పేపర్లు అంటే బ్యాలెట్ బాక్సులలో ఇంకు పోయడం, పోలింగ్ కేంద్రాలను కాప్చర్ చేయడం రిగ్గింగ్ చేయడం వంటివి ఉండేవి.

అంతే కాదు బ్యాలెట్ పేపర్ ని పోలి ఉన్న పేపర్లను తయారు చేసి మరీ ఫలితాలను మార్చే దుశ్చర్యలు సాగాయి. ఈ నేపధ్యంలో ఈవీఎంలే బెటర్ అని అంటున్నారు. ఏమైనా సలహా సూచనలు ఉంటే ఈవీఎంల విషయంలో ఇవ్వాలి కానీ ఇప్పటికి అనేక ఎన్నికలను చూసిన జగన్ తొలిసారి ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయడం మాత్రం సర్వత్రా విమర్శల పాలు అవుతోంది.

సాధారణంగా ఏదైనా విషయం మీద ఉంటే కొద్ది రోజులు మాత్రమే కౌంటర్లు ఉంటాయి. కానీ జగన్ చేసిన ఈ ట్వీట్ విలువ అయిదేళ్ళు అని అంటున్నారు. రానున్న అయిదేళ్ల కాలం అధికార పక్షంతో పాటు ఇతర పక్షాలు చెడుగుడు ఆడుకునే విధంగా జగనే తన ఒకే ఒక ట్వీట్ తో అవకాశం ఇచ్చారు అని అంటున్నారు.

Tags:    

Similar News