సింగిల్ డిజిట్ మాటెందుకు? వైనాట్ 175 ఏమైంది జగన్?

తన నోటి నుంచి వచ్చే మాటల్లో తేడా తన తీరును వేలెత్తి చూపేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది

Update: 2024-06-21 04:19 GMT

ఎదురుదెబ్బల నుంచి ఎంత త్వరగా పాఠాలు నేర్చుకుంటే అంత మంచిది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. తన నోటి నుంచి వచ్చే మాటల్లో తేడా తన తీరును వేలెత్తి చూపేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకొని..ప్రజాస్వామ్యంలో ఎవరికి సాధ్యం కాని నూటికి నూరు శాతం సీట్లను సొంతం చేసుకోవాలన్న అత్యాశను తెర మీదకు తీసుకొచ్చి వైనాట్ 175? అంటూ చేసిన ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారా?

ఎవరెన్ని చెప్పినా వైనాట్ 175 పాట పాడిన జగన్.. ఎన్నికల వేళ తేడా గాలి వీస్తుందని చెప్పినా.. గత ఎన్నికల్లో వచ్చిన 151 కంటే ఒకట్రెండు సీట్లు అధికంగా రావటం ఖాయమని తాను నమ్మి.. తన వాళ్లను నమ్మించిన దానికి జరిగిన నష్టం గురించి జగన్ మర్చిపోయారా? వాస్తవిక అంశాల్ని చూసే సహజ ప్రక్రియను ఆయన ఎందుకు మిస్ అవుతున్నారు? అన్నది మరో సందేహం.

దారుణ ఓటమి వేళ.. నిరాశ.. నిస్ప్రహలకు లోనయ్యే టీంను తట్టి లేపటం.. వారిని కార్యోన్ముఖుల్ని చేయటం తప్పేం కాదు. అందుకు అవసరమైన స్థైర్యాన్ని వారిలో నింపటం జట్టు నాయకుడిగా ఆయన వ్యవహరించాల్సిందే. అదే సమయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలు.. చెప్పిన మాటలకు అనుగుణంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని జగన్ తన తాజా ప్రసంగాల్లో మిస్ అవుతున్నారు. ఓటమి వేళ.. ప్రజల ముందుకు వచ్చిన సందర్భంలో ఓట్లేయని అవ్వతాతలు.. అక్కచెల్లెళ్ల ప్రేమ మీద ప్రశ్నలు సంధించిన జగన్.. తాజాగా తన రాజకీయ ప్రత్యర్థి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన సరిగ్గా నెల కూడా కాలేదు. ఆ మాటకు వస్తే కొలువు తీరే పది రోజులు కాలేదు. అలాంటిది ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఫలితాల మీద మాట్లాడటం.. తన అంచనాలు చెప్పటం ఏ మాత్రం సరికాదు. ఇప్పటికి ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి చాలామంది వైసీపీ నేతలు.. కార్యకర్తలు కోలుకున్నది లేదు. ఇలాంటి వేళలో.. మళ్లీ తనదైన రీతిలో వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ ప్రత్యర్థులను సింగిల్ డిజిట్ కే పరిమితం చేద్దామన్న పిలుపు తొందరపాటే అవుతుంది.

ఒకవిధంగా ఈ తరహా వ్యాఖ్యలతో మేలు కంటే కూడా బ్యాక్ ఫైర్ అయ్యే వీలుంది. ఓడిన వేళలో తగ్గి ఉండాలన్నట్లుగా వాతావరణం ఉంటుంది. అలాంటివేళలో.. ప్రజల మూడ్ కు అనుగుణంగా.. తమ వల్ల జరిగిన పొరపాట్లను సరి చేసుకుంటామని.. ప్రజల మనసుల్ని గెలుచుకుంటామన్న రీతిలో ఉండాల్సిన మాటలకు భిన్నంగా ప్రజలు మోసపోయారని చెప్పటంలో అర్థం లేదన్న మాట వినిపిస్తోంది.

కోట్లాది మంది ప్రజల్ని అంత ఈజీగా మోసం చేయగలరా? ఒకవేళ.. జగన్ మాటల ప్రకారం ప్రజల్ని మోసం చేశారనే అనుకుందాం? మరి.. అప్పుడు అధికారంలో ఉన్నదెవరు? ఎదుటోడు మోసం చేస్తున్నప్పుడు.. వారు చేస్తున్నది మోసం.. నమ్మొద్దని చెప్పటంలో సక్సెస్ కావాలి కదా? అలా కూడా కాలేదంటే.. నమ్మొద్దని తాను చెప్పే మాటల్ని ప్రజలు నమ్మకపోవటం తన ఫెయిల్యూర్ కిందనే అవుతుందన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నిందలు వేయటం.. అవసరానికి మించిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించే కన్నా.. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు ఊరట కలిగేలా కార్యాచరణ మీద జగన్ ఫోకస్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే.. సింగిల్ డిజట్ మాటల్ని పక్కన పెడితే మంచిది. లేదంటే.. వైనాట్ 175 వద్దా? అన్న వ్యాఖ్యలు తెర మీదకు వస్తాయి.

Tags:    

Similar News