రాహుల్ ఫ్యూచర్‌పై నీలినీడలు.. జాతీయ పార్టీకి ఎందుకీ దుస్థితి..?
ఊహించని విధంగా ఫలితాలు వస్తుండడంతో కాంగ్రెస్ అగ్రనేతలు సైతం డైలమాలో పడినట్లుగా ప్రచారం జరుగుతున్నది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డేంజర్ బెల్స్ ఎదుర్కొంటున్నదా..? ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సత్తా చాటలేకపోతున్నదా..? దీంతో ఇండియా కూటమి నేతలు ఆలోచనలు పడ్డారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఫలితాలు వస్తుండడంతో కాంగ్రెస్ అగ్రనేతలు సైతం డైలమాలో పడినట్లుగా ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కూటమికి అనుకూల ఫలితాలే వస్తాయని ప్రచారం జరిగింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని, కూటమిలో భాగస్వాములైన పార్టీలే అధికారాన్ని చేపడుతాయని సర్వేలు సైతం వెల్లడించాయి. కానీ.. హర్యానా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా గెలిచిన జమ్మూకశ్మీర్‌లోనూ కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కేవలం ఆరు సీట్ల వద్దే ఆగిపోయింది.
నిన్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. మహారాష్ట్రలో ఊహించని ఫలితాలు కాంగ్రెస్‌కు ఎదురయ్యాయి. కూటమితో ఖచ్చితంగా గెలిచి తీరుమని అనుకున్న కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం పోస్టుమార్టం ప్రారంభించింది. గత పార్లమెంటల్ ఎన్నికలు కాంగ్రెస్‌కు అంతో ఇంతో ఊరటనిచ్చాయి. అయితే.. అవే ఫలితాలు మహారాష్ట్రలోనూ రిపీట్ అవుతాయని ముందుగా నమ్మకం పెట్టుకుంది. కానీ.. బీజేపీ కూటమి ముందు కాంగ్రెస్ చేతులెత్తేయాల్సి వచ్చింది. ఇక ఈ ఫలితాలతో కాంగ్రెస్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా అన్న టాక్ నడుస్తున్నది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు.
జార్ఖండ్ వరకు సోరెన్ సహకారంతోనే కూటమి విజయం సాధించిందని చెప్పాలి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు ఇలా ఉంటే.. కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉంది అంటే అది వయనాడ్ ఉప ఎన్నికనే. అక్కడ పోయిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గెలుపొందారు. ఆయన రాజీనామాతో ప్రియాంకగాంధీ పోటీ చేశారు. భారీ మెజార్టీతో గెలుపొందారు.
మహారాష్ట్రలో స్థానిక అంశాలతోపాటు మహిళలు, యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అలాగే.. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అక్కడ ఉదాహరణగా చెబుతూ ప్రచారంలో పాల్గొంది. తెలంగాణ సీఎం నుంచి మొదలుకొని మంత్రులు కూడా ఇదే అంశాలతో మహారాష్ట్రలో ప్రచారం చేశారు. కానీ.. అవన్నీ కూడా మహాయుతి కూటమి ముందు నిలువలేకపోయాయి. దీనికి మరో కారణం కూడా ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అని ప్రచారం ఉంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలోనూ ప్రచారంలో పాల్గొన్న నేతలతోపాటు లోకల్ లీడర్లతో సమన్వయం లేకుండా పోయిందన్న ప్రచారం ఉంది. కూటమి నేతల మధ్య కూడా సఖ్యత లోపించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ 101 సీట్లలో పోటీ చేసింది. కానీ.. ఆ పార్టీకి 16 స్థానాలు మాత్రమే దక్కాయి. మిత్రపక్షాల మీదనే చాలా వరకు ఆధారపడింది. అంతేకాదు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మరింత బలహీన పడినట్లుగా తెలుస్తోంది. మహాయుతికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అయితే.. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కాంగ్రెస్ భవిష్యత్ మరింత ప్రశ్నార్థకంలో పడిపోయే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతున్నది.
1990లో శరద్ పవార్ నేతృత్వంలోని 49శాతం ఓట్లతో 141 సీట్లు సాధించింది కాంగ్రెస్. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ మూడంకెల సీట్లకు ఏనాడూ చేరుకోలేదు. శరద్ పవర్ సొంత పార్టీ పెట్టడం వల్ల 1995లో కాంగ్రెస్ పార్టీ 80 సీట్ల వద్దే ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో రెండో సారి అధికారానికి దూరమైంది. ఆ తరువాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ ఏటా బలహీనపడుతూనే ఉంది. అందుకే గత మూడు దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ మహారాష్ట్రలో ఎప్పుడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
మరోవైపు.. ఈ టర్మ్‌లోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భావించింది. కానీ.. జమిలీపై వ్యతిరేకత రావడం, పార్టీలు సైతం ఒప్పుకోకపోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అంతేకాకుండా జమిలీ సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని నియమించారు. గత కొద్ది నెలల క్రితం కమిటీ రాష్ట్రపతికి నివేదిక అందించింది. జమిలీ ఎన్నికలు సాధ్యపడుతాయని తన నివేదికలో పేర్కొంది. దాంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలను జమిలీ పద్ధతిలోనే నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లు పెట్టాలని యోచిస్తోంది. ఈ క్రమంలో జమిలీకి కనుక గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. వచ్చే నెలలోనే ఢిల్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అక్కడ తాము ఒంటరిగానే పోటీచేస్తామని ఇప్పటికే ఆప్ ప్రకటించింది. కూటమి నుంచి తప్పుకున్నంత పనిచేసింది. దాంతో ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎలా గట్టెక్కుందో తెలియని పరిస్థితి ఉంది. బిహార్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఏమైనా ప్రభావం చూపుతుందా..? అసలు జాతీయ పార్టీకి ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి..? అనేది పార్టీలోనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రాహుల్ భవిష్యత్ మరింత ప్రశ్నార్థకంగా మారేలా ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది.