ఐదేళ్లలో జగన్ చేసిన అత్యంత ఖరీదైన తప్పు అదేనట!

స్వయంగా జగన్మోహన్ రెడ్డి సైతం బ్లాంక్ ఫేస్ లో ప్రశ్నించటం చూస్తే.. ఆయన చాలానే విషయాల్ని మిస్ అయిన విషయం అర్థమవుతుంది.

Update: 2024-06-05 10:53 GMT

ఒక్కటంటే ఒక్క కారణం ఒక పొలిటికల్ పార్టీకి ఉన్న పవర్ ను తీసేస్తుందా? ఒక అధినేత ఓటమికి కారణమవుతుందా? అంటే చాలామంది ఏకీభవించకపోవచ్చు. కానీ.. తరచి చూస్తే.. అలాంటి ఒకట్రెండు ఘటనలు డౌన్ ఫాల్ కు తెర తీస్తే.. తర్వాతి రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలు అంతకంతకూ పెరిగి.. చివరకు షాకిచ్చే ఫలితానికి కారణం అవుతుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఓటమికి కారణం ఏమిటి? అన్నది ఇప్పుడుపెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయాన్ని ఎవరో అడిగితే ఫర్లేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి సైతం బ్లాంక్ ఫేస్ లో ప్రశ్నించటం చూస్తే.. ఆయన చాలానే విషయాల్ని మిస్ అయిన విషయం అర్థమవుతుంది.

అధికారంతో వచ్చిన సమస్య ఏమంటే.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది? అన్న దానిని యథాతధంగా చెప్పే వారు ఉండరు. మీరు గొప్ప అంటే.. కాదు సార్ మీరు దేవాంశ అని ఇంకొకరు.. వారికి మించి మరొకరు.. ఇలా ఎవరికి వారు చెలరేగి మరీ గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు నిజం పక్కకు వెళ్లిపోతుంది. అబద్ధం అంతకంతకూ పెద్దదిగా మారుతూ.. అదే నిజమన్నట్లుగా నమ్మే పరిస్థితిలోకి వెళ్లిపోతాం. దీంతో.. ప్రజలకు పాలకులకు మధ్య ఉన్న దూరం పెరిగిపోయి.. వారి మనసుల్లో ఏముందన్న విషయాన్ని గుర్తించలేని స్థితికి చేరుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పాలి.

రాజకీయాల్లో గెలుపోటములు మామూలే. ప్రతిసారీ గెలవటం.. అధికారంలోకి రావటం ఎవరికి సాధ్యం కాదు. ఇది నిజం. దాన్ని ఒప్పుకు తీరాల్సిందే. ఇంతకూ తాజా ఎన్నికల్లో వైసీపీ ఎందుకంత దారుణంగా ఓటమిపాలైంది. ఐదేళ్ల క్రితం 151 సీట్ల చారిత్రక గెలుపును అందించిన ఆంధ్రా ఓటర్లు. ఈసారి 164 సీట్లను టీడీపీ కూటమికి ఎందుకు కట్టబెట్టారు? అన్న విషయంలోకి వెళ్లినప్పుడు అధికారంలో ఉన్న వేళలో జగన్ చేసిన తప్పులు కూడా కారణమన్నది ఒప్పుకోవాల్సిందే. గత ఎన్నికల్లో కాపు ఓట్లు చీలిపోగా.. తాజా ఎన్నికల్లో కాపు ఓట్లు ఏకం కావటం.. వారంతా ఒకే మాట మీద ఉండటం కూడా తాజా ఎన్నికల ఫలితాలకు కారణమని చెప్పాలి.

జగన్ పార్టీ ఘోర ఓటమి తర్వాత కాపు వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున మాట్లాడినప్పుడు వారందరూ తమ మాటల్లో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించిన ఒక అంశం ఉంది.దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ సినిమా టికెట్ల ఎపిసోడ్ వేళ.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో అప్పటి సీఎం జగన్ భేటీ కావటం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని జగన్ సరిగా ట్రీట్ చేయలేదని.. ఆయనకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్న భావన పెద్ద ఎత్తున అప్పట్లో వ్యాపించింది. అయితే.. ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేయటం కోసం మరోసారి జగన్ కలిసినప్పటికి.. కాపుల మనసులకు తగిలిన గాయం మాత్రం మాయలేదన్నది ఇప్పుడు చర్చగా మారింది.

వ్యక్తిగతంగా వంక పెట్టలేని మెగాస్టార్ చిరంజీవిని అంత చులకనగా చూడటం ఏమిటి? తాము వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి.. తమ మనిషిని చిన్నబుచ్చటం కాపు సామాజిక వర్గంలోని వారెవరికి నచ్చలేదు. అప్పటి నుంచి వారి మనసుల్లో గూడు కట్టుకుపోవటమే కాదు.. పవన్ కల్యాణ్ పై అదే పనిగా మాటల దాడి చేయటం.. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లాంటివి కాపుల్లో మరింత కోపానికి గురయ్యేలా చేశాయి. మూడో పెళ్లి చేసుకున్న పవన్ ను.. నాలుగు పెళ్లిళ్లు అంటూ అదే పనిగా ఆయన్ను టార్గెట్ చేయటం.. స్కూల్ పిల్లల దగ్గర నుంచి తాను పాల్గొనే ప్రతి సమావేశంలోనూ దత్తపుత్రుడు పేరుతో చేసిన ఎటకారం కాపుల మనసుల్ని గాయపరిచినట్లుగా చెబుతున్నారు. చిరంజీవిని తక్కువ చేసి చూసిన వైనంతో మొదలైన కోపం.. పవన్ ను టార్గెట్ చేసి.. వెంటాడిన వైనం వారంతా రగిలిపోయేలా చేసిందని చెబుతున్నారు. చిరు విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తప్పు.. ఈ రోజు ఇలాంటి పరాజయానికి మొదటి మెట్టుగా మారిందన్న మాట ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

Tags:    

Similar News