"కుప్పం ప్రజలకు 14 వేల కొట్లు ఇచ్చా"
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలను పట్టించుకోలేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గం ప్రజల కు తన హయాంలో 14 వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల రూపంలో అందించానని సీఎం జగన్ చెప్పారు. తాజాగా ఇక్కడ పర్యటించిన ఆయన హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమం అందించామని మొత్తం 14 వేల కోట్ల రూపాయలు ఒక్క ఈ నియోజకవర్గానికే ఇచ్చామన్నారు.
చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలను పట్టించుకోలేదన్నారు. అందుకే.. ఇక్కడి ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని, ఈ కష్టాలు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అందుకే.. 672 కిలోమీటర్లు దాటుకుని, 1600 అడుగులు పైకెక్కి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించిందని సీఎం జగన్ వివరించారు. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామమన్నారు.
కుప్పం నియోజకవర్గంలో మరో 2 రిజర్వాయర్లు ప్రారంభించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ చెప్పారు. తన సొంత నియోకవర్గం 35 ఏళ్లుగా గెలుస్తున్న నియోజకవర్గం కుప్పం ప్రజలకే నీళ్లివ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇన్నేళ్లూ ఆయన్ను భరించిన కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు అని సీఎం జగన్ బిగ్గరగా వ్యాఖ్యానించారు.
"చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశారు. అయినా బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు. కుప్పానికి కృష్ణమ్మ నీరు తెచ్చింది. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది. రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే.? మీ బిడ్డ జగన్. చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా, దేశంలో అతిపెద్ద సహకార సంఘం డెయిరీ అమూల్ ను తీసుకొచ్చి పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించేలా ఏర్పాటు చేశాం. ఇదే చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మక సంస్థ వెల్లూరు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాం. ఈ నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో రూ.1400 కోట్లను జమ చేశాం" అని జగన్ వివరించారు.