జగన్ కి ప్రతిపక్ష హోదా...నిపుణులు చెప్పేది ఇదే!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు

Update: 2024-06-26 00:30 GMT

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ఇదిపుడు స్పీకర్ చెయిర్ పరిశీలనలో ఉంది. అయితే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అసలు రాజ్యాంగం ఏమి చెబుతోంది, అలా వీలు అవుతుందా అంటే రాజ్యాంగంలో చూస్తే మొత్తం అసెంబ్లీ సీట్లలోలో పది శాతం సీట్లు వచ్చిన పార్టీకే హోదా ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు.

అసలు రాజ్యాంగంలో ప్రతిపక్షం గురించి కూడా ప్రస్తావన లేదని నిపుణులు అంటున్నారు. ఇదంతా సభ్యులకు పార్టీలకు ముందు వరసలో సీట్లు కేటయించే విషయంలో 1950 ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఒక సర్దుబాటు అని అంటున్నారు. ఎవరు ముందు కూర్చోవాలి ఎవరు వెనక్కి అన్న చర్చ వచ్చినపుడు మొత్తం సీట్లలో పది శాతం పైగా వచ్చిన పార్టీలను ముందుకు కూర్చునేలా ఒక ఏర్పాటు చేసుకున్నారు

అయితే ఆ తరువాత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ రకమైన విధానాన్ని వ్యతిరేకించడం తో అది కూడా ఇప్పుడు లేదు. ఈ రోజుకు చూస్తే రాజ్యాంగంలో పదో వంతు సీట్లు వచ్చిన పార్టీకే ముందు వరస అని ప్రతిపక్ష హోదా అని ఎక్కడా నిర్దిష్టంగా చెప్పలేదని నిపుణులు అంటున్నారు.

ఇక దీని మీద అప్పట్లో లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య రాసిన ఆర్టికల్ లో ఇదే విషయం చెప్పారు. ఈ నిబంధన అన్నది ఎక్కడా లేదని అందులో స్పష్టం చేశారు. అయితే శాసన సభలో ఏ విషయం మీద నిర్ణయం జరగాలీ అన్నా అది స్పీకర్ అధికారాలతోనే అని అంటున్నారు.

స్పీకర్ తలచుకుంటే ఎవరికైనా హోదా ఇవ్వవచ్చు. ఇపుడు వైసీపీ అడుగుతున్నట్లుగా విపక్ష హోదా ఇవ్వడం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో ఉంది అని అంటున్నారు. దానికి గతంలో కొన్ని రాష్ట్రాలలఒ స్పీకర్లు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఉదహరిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో చూస్తే గతంలో బీజేపీకి మూడంటే మూడు సీట్లు వచ్చాయి. మొత్తం 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో పది శాతం అంటే ఏడు రావాలి.

అసలు అదే నిబంధన అనుకుంటే విపక్ష హోదా ఇవ్వకూడదు. కానీ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష హోదాను బీజేపీకి ఇచ్చారు. అప్పట్లో ఆప్ అధికారంలో ఉంది. మరి ప్రత్యర్థి ప్రభుత్వం ఉన్నా బీజేపీకి ఈ హోదా దక్కింది అంటే స్పీకర్ నిర్ణయం వల్లనే అని అంటున్నారు.

ఇక దేశంలో చూసుకుంటే లోక్ సభలో కాంగ్రెస్ కి గత రెండు దఫాలుగా ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు దక్కలేదు. అయినా కాంగ్రెస్ కి ముందు వరసలో సీట్లు ఇస్తున్నారు. చర్చ ఏది మొదలెట్టినా కాంగ్రెస్ వైపు నుంచే స్టార్ట్ చేస్తారు. వారికి కోరినంత సమయం కూడా స్పీకర్ ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్ ని ప్రతీ విషయంలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఇపుడు ఏపీ విషయానికి వస్తే జగన్ లేఖ రాయడం సమంజసమే అని అంటున్నారు. అయితే స్పీకర్ విచక్షణ మీదనే ఇది ఆధారపడి ఉంటుంది మరి ఈ విషయంలో అయ్యన్నపాత్రుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. అయితే చట్ట సభలలో చూస్తే అధికార పక్షం కానీ పక్షాలు అన్నీ విపక్షలే. అందులో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు.

లాజికల్ గా చూసుకున్నా ఇదంతా ఎందుకు అంటే సభలో అర్ధవంతమైన చర్చ సాగేందుకే అని అంటున్నారు. ఒకసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం విపక్షం వైపుకు వచ్చినపుడు వారు ప్రభుత్వ విధానాల మీద తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఉంటుంది. అలా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే అధికార ప్రతిపక్షాలు కలిపే అని అర్థం. సభ అంటే ఇదే వర్తిస్తుంది.

ఏపీలో చూస్తే టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు. అందువల్ల విపక్షంలో ఏకైక పక్షంగా వైసీపీ ఉంది. కాబట్టి రాజ్యాంగం లో ఈ చర్చ కానీ ప్రస్తావన కానీ లేనందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకుంటే వైసీపీకి విపక్ష హోదా దక్కుతుంది. సభలో డిబేట్స్ సంపూర్ణంగా సాగాలీ అంటే భిన్న వాదనలు వినిపించాలీ అంటే ఇదే కరెక్ట్ అని అంటున్నారు. మరి దీని మీద అయ్యన్న వైపే అందరి చూపూ ఉంది.

Tags:    

Similar News