జగన్ అర్ధ సెంచరీ కొడుతున్నా టీడీపీ క్యాంప్ కిటకిటలాడదేంటి...!?

ఈ పరిణామంతో వైసీపీ నుంచి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అది ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతుందని భావించిన టీడీపీకి మాత్రం ఏమీ అర్ధం కాని స్థితి అంటున్నారు.

Update: 2024-01-05 16:27 GMT

వైసీపీ అధినేత జగన్ చేస్తున్నది ఆషామాషీ కసరత్తు కాదు. ఆ మాటను మరోలా చెప్పాలీ అంటే ఏ ప్రాంతీయ పార్టీ అధినేత సాహసించని తీరున జగన్ భారీ కసరత్తు చేస్తున్నారు. తన ఎమ్మెల్యేలలో మూడవ వంతు మందిని ఆయన షఫలింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొందరికి నో చెప్పేస్తున్నారు. మరి కొందరికి ఆయన వేరే చోటు చూపిస్తున్నారు. ఇంకొందరికి ఢిల్లీ బాట చూపిస్తున్నారు.

ఇలా జగన్ చేస్తున్న ఈ అతి పెద్ద కసరత్తు వల్ల నిజానికి ఏపీలో రాజకీయ కలి పుట్టాలి. కలకలం రేగాలి. భూకంపాలే రావాలి. కానీ అలాంటివి ఏవీ జరగడం లేదు. అక్కడక్కడ మాత్రమే ఒకటీ అరా రాజీనామాలు కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేస్తే భారీ ఎత్తున అసంతృప్తి సునామీ వస్తుందని దాంతో తమ శిబిరాలు కిటకిటలాడతాయని ఊహించిన టీడీపీ జనసేనలకు అనుకున్నది జరగకపోవడం మాత్రం నిరాశే కలిగిస్తోంది అని అంటున్నారు.

వైసీపీలో భారీ సంఖ్యలో నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చి తమ వైపు చేరుతారు అని అనుకున్న వారికి మాత్రం ఇది అశనిపాతంగానే ఉంది అని అంటున్నారు. ఇక వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామక్రిష్ణారెడ్డి టీడీపీ జనసేనలను ఎంచుకోలేదు. ఆయన షర్మిల వైపే అంటున్నారు.

అదే విధంగా మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఇండిపెండెంట్ గా అంటున్నారు తప్ప ప్రతిపక్ష శిబిరం వైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో ఏదో తలిస్తే ఏదో జరిగింది అని విపక్ష శిబిరం నేతలు అనుకుంటున్నారు.

జగన్ చేసేది దుస్సాహసం అని ఒక్కరు కూడా మిగలరు అని చెట్టుకొకరుగా పిట్టకొకరుగా బయటకు పోతారని అనుకున్నా అలాంటి సీను అయితే లేదు. జగన్ అడ్జస్ట్ మెంట్లు చేస్తున్నారు. నేతలకు నచ్చచెబుతున్నారు. మొత్తానికి ఏదో విధంగా వైసీపీలో అంతా దారిలోనే ఉన్నారు.

దీనికి మరో కారణం ఉంది అని అంటున్నారు. టీడీపీలోకి వెళ్ళినా టికెట్ గ్యారంటీ లేదు. అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీ కండువా కప్పుకున్నా మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్ధి పీలా గోవింద సత్యనారాయణకే వచ్చే ఎన్నికలలో గెలుపు సాయం చేయాల్సి ఉంటుంది.

అలాగే వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ కి టికెట్ హామీ లేదని అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన వారు అంతా వైసీపీలోనే ఉండిపోతున్నారు. కొందరు అయితే కాంగ్రెస్ లోకి వెళ్లాలని చూస్తున్నారు.

అంతే తప్ప టీడీపీ జనసేన పట్ల మాత్రం ఎవరూ ఆశలు పెట్టుకోవడంలేదు. దీంతోనే జగన్ కి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అని అంటున్నారు. ప్రతిపక్ష శిబిరంలోని పరిస్థితిని పొత్తుల గొడవలు ఇబ్బందులు అన్నీ చూసి సరైన టైం లోనే జగన్ ఈ భారీ కసరత్తుకు శ్రీకారం చుట్టారు అని అంటున్నారు.

ఈ పరిణామంతో వైసీపీ నుంచి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అది ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతుందని భావించిన టీడీపీకి మాత్రం ఏమీ అర్ధం కాని స్థితి అంటున్నారు. చేరికలను చూపించి ఏపీలో రాజకీయ మార్పు ఉందని, జనాలు పూర్తిగా అధికార పార్టీ పట్ల విముఖంగా ఉన్నారని మొత్తం పొలిటికల్ సీన్ చేంజ్ చేయాలని చూసిన విపక్ష శిబిరం మాత్రం ఆలోచనలో పడిపోయింది అంటున్నారు.

జగన్ అభ్యర్ధుల మార్పు విషయంలో అతి దూకుడు చేస్తున్నారు అని అంతా మొదట్లో అనుకున్నారు కానీ ఆయన అన్నీ గమనించి వ్యూహాత్మకంగానే యాక్షన్ ప్లాన్ తో దిగారని ఇపుడు అర్ధం అవుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News