పులివెందుల ట్రిప్ తో కొత్త ఉత్సాహంలో జగన్!

అంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆయనకు ఎన్నికల ఫలితాలు శరాఘాతంగా మారాయి.

Update: 2024-06-24 05:03 GMT

మూడు రోజుల పులివెందుల నియోజకవర్గంలో పర్యటనను పెట్టుకున్న వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూట కట్టుకోవటం.. సింగిల్ డిజిట్ ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకొని.. కేవలం పదకొండు సీట్లకు పరిమితం కావటం తెలిసిందే. వైనాట్ 175 అంటూ ప్రచారం చేపట్టి.. కీలకమైన పోలింగ్ ముగిసిన తర్వాత 2019లో సాధించిన 151 కంటే నాలుగు సీట్లు అధికంగా తెచ్చుకుంటామన్న మాటను ఐప్యాక్ సభ్యులతో జగన్ పంచుకోవటం తెలిసిందే.

అంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆయనకు ఎన్నికల ఫలితాలు శరాఘాతంగా మారాయి. కలలో కూడా ఊహించని పరాజయం ఆయన్ను పలుకరించింది. దీంతో.. ఆయన తీవ్ర అసంత్రప్తితో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పరాజయ షాక్ నుంచి ఆయన కోలుకోలేనట్లుగా తెలుస్తోంది. ఐదేళ్ల తమ పాలనలో వ్యూహాత్మకంగా వివిధ పథకాలతో లబ్థిదారులను లక్ష్యంగా చేసుకొని.. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నప్పటికీ ఇంత దారుణ ఓటమి ఎలా? అన్నది అర్థం కాని ఫజిల్ గా మారింది.

దీంతో ఆయన తీవ్రమైన నిరాశలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగానే.. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రమాణానికి వచ్చిన జగన్.. అక్కడ ఎక్కువసేపు ఉండలేక వెళ్లిపోయినట్లుగా చెబుతారు. నిజానికి ఆయన మరికొంతసేపు అసెంబ్లీ ప్రాంగణలో ఉండి.. పార్టీ నేతలతో కాస్తంత ఎక్కువసేపు గడిపితే బాగుండన్న మాట వినిపించింది. అయితే.. వాటిని పట్టించుకోకుండా తన మానాన తాను తాడేపల్లి ఇంటికి వెళ్లిపోవటం తెలిసిందే.

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజున తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పర్యటించేందుకు సొంత జిల్లాకు వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన సమయంలో జగన్ మూడ్ కు.. పులివెందులకు వచ్చేసరికి ఆయన మూడ్ పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. దీనికి కారణం.. ఆయన ఏ మాత్రం ఊహించని రీతిలో ప్రజలు జగన్ కు అండగా నిలిచామన్న సంకేతాన్ని తమ రాకతో చెప్పేశారు. అశేష ప్రజానీకం పులివెందులకు తరలి వచ్చిన వైనం జగన్ కు కొత్త టానిక్ గా మారిందంటున్నారు.

దారుణ పరాజయం వేళ.. కాస్తంత ఊరట దక్కితే చాలనుకున్న దానికి భిన్నంగా.. భారీ ఎత్తున సాంత్వన కలిగేలా పులివెందుల ప్రజలు వ్యవహరిచారన్న మాట వినిపిస్తోంది. మూడు రోజుల పులివెందుల పర్యటన జగన్ కు కొత్త శక్తిని ఇవ్వటమే కాదు.. భారీగా వెల్లువెత్తిన ప్రజాభిమానం ఆయన ఆలోచనా తీరు మీద కూడా ప్రభావితం చేస్తుందన్న మాట ఆయన సన్నిహితుల నోటి నుంచి వినిపిస్తోంది. మొత్తానికి పులివెందుల ట్రిప్.. జగన్ కు సరికొత్త ఎనర్జీని అందించిందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News