బోర్డుపై జగన్ రాసిన అందమైన కోట్ ఇది...!

"అన్ని దేవదూతలకు రెక్కలు లేవు.. కొంతమందికి స్టెతస్కోప్‌ లు ఉన్నాయి" అంటూ ఏపీ జగన్ కోట్ రాశారు.

Update: 2023-09-15 13:35 GMT

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను మెరుగుపరిచేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచడంతోపాటు... విలేజ్ క్లీనిక్స్ ని కూడా జగన్ యాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించారు వైఎస్ జగన్.

అవును... ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. వరల్డ్‌ క్లాస్‌ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి రానున్నాయి.

ఇందులో భాగంగా... విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం జగన్‌ ప్రారంభించారు. విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌ గా మిగతా నాలుగు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైద్య విద్యార్థులతో కలిసి జగన్ ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా బోర్డుపై ఒక కోట్ రాశారు. "అన్ని దేవదూతలకు రెక్కలు లేవు.. కొంతమందికి స్టెతస్కోప్‌ లు ఉన్నాయి" అంటూ ఏపీ జగన్ కోట్ రాశారు. దీంతో... సరైన సమయంలో, సరైన సందర్భంలో, సరైన వాక్యం అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అంటే... “వైద్యో నారాయణో హరి” ని జగన్ తనదైన శైలిలో చేప్పారన్నమాట.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. "దేవుడి దయతో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలి. మీరంతా అత్యున్నత స్థాయికి చేరుకోవాలి" సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

కాగా... ఏపీలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కట్టడం కోసం ప్రభుత్వం సుమారు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో.. మొత్తంగా ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 4,735కు చేరుతుంది. ఇదే క్రమంలో... ఈ ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

Tags:    

Similar News