చంద్రబాబులో ఇంత మార్పు.. దేనికి సంకేతం?

తన కెరీర్ లో ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు.. ఏకంగా నెలల తరబడి జైల్లో మగ్గాల్సి వచ్చింది.

Update: 2024-10-22 10:30 GMT

అధికారంలో ఉన్న టైం కంటే ప్రతిపక్షంలో ఉన్న సమయమే ఎక్కువగా ఉంటుంది చంద్రబాబు పొలిటికల్ కెరీర్ ను చూస్తే. తాజాగా మరోసారి అధికారంలోకి వచ్చిన ఆయన మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన కాలం తగ్గనుంది. దాదాపు పద్నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవి ఆయనకు కొత్త కాకున్నా.. అధికారంలో ఉన్న వేళలో చంద్రబాబు వ్యవహరించే తీరుకు ఇప్పుడాయన వ్యవహారశైలిలో మార్పుకొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

తన కెరీర్ లో ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు.. ఏకంగా నెలల తరబడి జైల్లో మగ్గాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు దారుణంగా ఉండటంతో పాటు.. ఆయన పట్ల అప్పటి అధికారులు వ్యవహరించిన తీరు ఆయన్ను తీవ్రంగా గాయపర్చినట్లుగా చెబుతారు. ఇదే.. చంద్రబాబులో తీవ్రమైన మార్పునకు కారణమైందని చెబుతారు. ఆయన్ను సన్నిహితంగా చూసే వారంతా ఒక విషయాన్ని తరచూ చెబుతున్నారు ఇటీవల కాలంలో. జైలుకు ముందు చంద్రబాబు.. జైలు తర్వాత చంద్రబాబు అన్నట్లుగా పరిస్థితి ఉందన్న మాట తరచూ వినిపిస్తోంది.

దీనికి తగ్గట్లే.. గతానికిభిన్నంగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయనలో హ్యుమన్ టచ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. కీలక పదవులుఅప్పజెప్పాల్సి ఉన్నా.. అలా సాధ్యం కాని వేళలో.. వారిని తన వద్దకు పిలిపించుకొని బుజ్జగించే ధోరణి పెరగటమే కాదు.. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. పార్టీ కోసం కష్టపడినవారికి సాయం చేసే తీరును వంట బట్టించుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. గతలో తాను ముఖ్యమంత్రి అన్న అహం చంద్రబాబులో కనిపించేది. ఇప్పుడా భ్రమలు ఏమీ లేవని చెబుతారు. తన సమర్థత మీదనే ఎక్కువగా నమ్మే ఆయన.. ఇప్పుడు ప్రజలే తన అధికారానికి కారణమే తప్పించి.. తన గొప్పతనం లేదన్నట్లుగా ఆయన తీరు మారిందంటారు.

మిత్రుల విషయంలోనూ చంద్రబాబు తీరుపై విమర్శలు ఉండేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయన వ్యవహరశైలి ఉందని చెబుతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ తో ఆయన వ్యవహరించే ధోరణిని ఉదాహరణగా చెబుతున్నారు. 2014లో మిత్రుడిగా ఉన్న పవన్ ను.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? అన్నది చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదంతా జైలు జీవితంతో వచ్చిన మార్పేనన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

తాజాగా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి నోట ఒక మాట వచ్చింది. ఈ మధ్యన తాను చంద్రబాబును కలిసిన సమయంలో.. మంత్రిగా అవకాశం ఇవ్వలేకపోయాను.. బాధపడ్డారా? అని అడిగిన విషయాన్ని రివీల్ చేశారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మారిన చంద్రబాబు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తారని చెప్పక తప్పదు. కొన్నిసార్లు కొన్ని ఘటనలు జరగటం మంచిదేనని చెబుతారు. చంద్రబాబుకు ఈ మాట వర్తిస్తుందనే చెప్పాలి.

Tags:    

Similar News