జై శంకర్‌... తగ్గేదే లే!

ఇప్పుడు ఐక్యరాజ్యసమితి వంతు వచ్చింది. భారత్‌ లో ఎన్నికలపై ఐరాస సీనియర్‌ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మండిపడ్డారు.

Update: 2024-04-05 05:19 GMT

గతంతో పోలిస్తే భారత్‌ విదేశాంగ విధానంలో దూకుడు కనబరుస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాక విదేశాంగ విధానంలో భారత మెతక వైఖరి మారిందనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఏ దేశమైనా భారత్‌ ను తప్పుపడితే మన దేశం నుంచి కౌంటర్లు ఉండేవి కాదు. ఇప్పుడు అలా కాదు.. భారత్‌ విషయాల్లో జోక్యం చేసుకునేది అమెరికా అయినా వదిలిపెట్టడం లేదు. తిరిగి గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో భారత్‌ కు సుద్దులు చెప్పడానికి ప్రయత్నించిన అమెరికా, జర్మనీలకు భారత్‌ కర్రుకాల్చి వాత పెట్టింది. కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారాన్ని గమనిస్తున్నామని, నిష్పాక్షిక పారదర్శక విచారణ జరగాలని తాము ఆశిస్తున్నామని అమెరికా, జర్మనీ పేర్కొనగా భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాల రాయబారులను పిలిపించి వారికి సమన్లు జారీ చేసింది. భారత్‌ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని తెలిపింది. తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా వ్యవహరించవద్దని ఆ రెండు దేశాలకు ఘాటుగా బదులిచ్చింది.

ఇప్పుడు ఐక్యరాజ్యసమితి వంతు వచ్చింది. భారత్‌ లో ఎన్నికలపై ఐరాస సీనియర్‌ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మండిపడ్డారు. భారత్‌ లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని.. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని తాము ఆశిస్తున్నామని ఇటీవల ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికలను ఎలా నిర్వహించాలో ఐరాస తమకు చెప్పాల్సిన పనిలేదంటూ జైశంకర్‌ ఘాటుగా బదులిచ్చారు. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగానే జరుగుతాయని.. ఈ వ్యవహారంలో తమకు సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదని ఐరాసకు జైశంకర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

అపోహలు, అసత్యాలతో కూడిన ప్రశ్నకు బదులిస్తూ భారత ఎన్నికలపై ఐరాస ప్రతినిధి స్పందించారని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎన్నికల గురించి ఎవరూ చింతించాల్సిన అవసరం లేదని.. అవి పారదర్శకంగానే జరుగుతాయని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News