వైసీపీ కంచుకోటలో టీడీపీ అభ్యర్థి ఫిక్స్!
ఈ సందర్భంగా చంద్రబాబు జమ్మలమడుగులో పోటీ చేసే టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు
వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. 2014 ఎన్నికల్లో ఒక్క రాజంపేట మినహాయించి జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలను వైసీపీ ఎగరేసుకుపోయింది. ఇక 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ కొల్లగొట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మ్యాజిక్కును కొనసాగించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ కంచుకోటలపై దృష్టి సారించారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓడిపోయిన నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తమకు కొరకరాని కొయ్యగా మారిన వైఎస్సార్ జిల్లాపై దృష్టి సారించారని చెబుతున్నారు.
ఇందులో భాగంగానే ప్రస్తుతం చంద్రబాబు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన జమ్మలమడుగుతోపాటు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనూ పర్యటించి భారీ బహిరంగ సభలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లోనూ తమను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు జమ్మలమడుగులో పోటీ చేసే టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు. గతంలో జమ్మలమడుగులో టీడీపీకి మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి రూపంలో గట్టి నేత అందుబాటులో ఉండేవారు. అయితే వైసీపీ గెలిచాక ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసి తమ వైపు తిప్పుకుంది. దీంతో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో జమ్మలమడుగులో టీడీపీకి ఇంచార్జి లేకుండా పోయారు.
ఈ నేపథ్యంలో తాజాగా జమ్మలమడుగుకు చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు అభ్యర్థిగా ఫిక్స్ చేశారు.
గతంలో పి.రామసుబ్బారెడ్డి 1994, 1999ల్లో జమ్మలమడుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు, 2004, 2009, 2014, 2019ల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి ఓటమిపాలయ్యారు. అయితే చంద్రబాబు రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.
అయితే 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన రామసుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసీపీ తరఫున జమ్మలమడుగులో గెలిచిన తన ప్రత్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి రావడాన్ని రామసుబ్బారెడ్డి జీర్ణించుకోలేకపోయారని అంటారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న ఉద్దేశంతో రామసుబ్బారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రస్తుతం వైసీపీ తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ప్రస్తుతం సుధీర్ రెడ్డి ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. సుధీర్ రెడ్డి మాజీ హోం మంత్రి మైసూరా రెడ్డి సోదరుడి కుమారుడు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న భూపేష్ రెడ్డి కూడా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.