కశ్మీర్ ఎన్నికల విషయంలో కీలక అప్ డేట్... ఎవరీ ఇల్తిజా?

కేంద్ర ఎన్నికల సంఘం హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-20 14:30 GMT

కేంద్ర ఎన్నికల సంఘం హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జమ్మూ కశ్మీర్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఎన్నికల బరిలో నిలవనున్నారు.. బీజేపీ ఒంటరిగా పోటీ చేయబోతుంది.

అవును... జమూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. ఈసారి ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నేత మొహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఆమె బిజ్ బెహరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది.

పీడీపీ ఈ మేరకు ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇల్తిజా పేరు కూడా ఉంది. ఇదే సమయంలో... మెహబూబా మాత్రం ఎన్నికల్లో పోటీ చేయబోరని.. ఇల్తిజా మాత్రమే బరిలో నిలవనున్నారని అంటున్నారు.

కాగా... ఢిల్లీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇల్తిజా ముఫీ... బ్రిటన్ లోని వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఈ నేపథ్యంలోనే ఆర్టికల్-370 రద్దు తర్వాత మెహబూబా నిర్భందంలో ఉన్న సమయంలో ఈమె వెలుగులోకి వచ్చారు. తన తల్లిని అక్రమంగా నిర్బంధించారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

అనంతరం మెహబూబా విడుదలయ్యారు. ఆ తర్వాత ఇల్తీజా మీడియా మీటింగ్ లలో బాగా కలిగి ఉండేవారు. ఈ నేపథ్యంలోనే జమూ కశ్మీర్ ప్రజలను ప్రభావితం చేసే సమస్యలు, నిర్ణయాలను చర్చించే లక్ష్యంతో "ఆప్కీ బాత్ ఇల్తిజా కే సాథ్" అనే థీంతో ఓ వీడియో సిరీస్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు పార్టీ టిక్కెట్ దక్కింది.

మరోవైపు... జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా వెల్లడించారు. అయితే.. కశ్మీర్ లోయలోని 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మాత్రం పోటీ చేయనున్నట్లు పేక్రొన్నారు. ఈ చర్చలు కార్యరూపం దాల్చిన అనంతరం తొలి జాబితా విడుదల ఉంటుందని వెల్లడించారు.

Tags:    

Similar News