టీడీపీ కంచుకోటలలో జనసేన వాటా ..?
ఈ నేపధ్యంలో ఆయా సీట్లకు గేలం వేస్తోంది జనసేన. తమకూ వాటిలో వాటా ఉందని అంటోంది. పొత్తులు ఉంటే ఆయా సీట్లు ఇచ్చి తీరాల్సిందే అని అంటోంది.
విశాఖ తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా ఉన్న కంచుకోటలలో మళ్లీ వారే గెలవాలని చూస్తారు. అది సహజం. ఇక ఆ సీట్లో దశాబ్దాలుగా అట్టేపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు చేస్తే తామే పోటీ చేయాలి లేకపోతే తమ వారసులకు ఆ సీట్లు రావాలి అని పంతం మీద ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయా సీట్లకు గేలం వేస్తోంది జనసేన. తమకూ వాటిలో వాటా ఉందని అంటోంది. పొత్తులు ఉంటే ఆయా సీట్లు ఇచ్చి తీరాల్సిందే అని అంటోంది.
విశాఖలో పవన్ మానియా స్టార్ట్ అయిపోయింది. వారాహి మూడవ విడత యాత్రను ఆయన ఏకంగా విశాఖ సిటీ సెంటర్ పాయింట్ అయిన జగదాంబా సెంటర్ నుంచి మొదలెట్టారు. అది సౌత్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వారాహి సభకు తరలి వచ్చారు. అలా విశాఖ సిటీలో దక్షిణం నుంచి పవన్ యాత్ర మొదలెట్టారు. ఉత్తరం, తూర్పు పశ్చిమం కూడా ఉన్నాయి. అయితే పవన్ సభలు గాజువాక, పెందుర్తి, భీమిలీలతో పాటు, అనకాపల్లి, ఎలమంచిలి పాయకరావు పేట, చోడవరం దాకా సాగుతాయని అంటున్నారు.
ఈ సీట్లన్నీ జనసేన ఫోకస్ పెట్టినవే అంటున్నారు. ఎనిమిదింటికి గురి పెట్టి ఆరింటికి తగ్గకుండా విశాఖ జిల్లాలో తీసుకోవాలని జనసేన చూస్తోంది. అందులో ఆరు నూరు అయినా భీమునిపట్నం, విశాఖ ఉత్తరం, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి సీట్లను అసలు వదులుకోరాదని జనసేన పట్టుబట్టి ఉంది.
ఇక కొత్తగా మాడుగుల నర్శీపట్నంల నుంచి కూడా జనసేన పోటీ చేయాలంటూ ఆ పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్నాయి. నర్శీపట్నంలో సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన సొంత సీటు అది. అక్కడ జనసేన ఇటీవల కాలంలో కొత్తగా పార్టీలోకి ఇతర పార్టీల నేతలను చేర్పిస్తోంది. దూకుడు చేస్తోంది. సొంత్నగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసీపీ ఎమ్మెల్యేను జనసేన నాయకులు ఢీ కొంటున్నారు.
ఇదే పరిస్థితి మాడుగులలో కూడా ఉంది. ఈ సీటుని కూడా తీసుకోవాలని జనసేన నేతలు కోరుతున్నారు. ఇక్కడ యువ నాయకుడు ఒకరు జనసేన తరఫున విపరీతంగా జనంలో తిరుగుతున్నారు. అంగబలం అర్ధంబలం దండీగా ఉన్న ఆయన జనసేన తరఫున తప్పక పోటీ చేస్తాను అని అంటున్నారు. దీంతో జనసేన ఫోకస్ పెడుతున్న సీట్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మరి వీటిలో ఎన్ని టీడీపీ ఇస్తుంది. జనసేన ఎన్నింటికి ఒప్పుకుని పొత్తుకు సిద్ధపడుతుంది అన్నది చూడాల్సి ఉంది.
నిజానికి విశాఖ జిల్లా టీడీపీకి జనసేనకు కూడా బలంగా ఉన్న జిల్లా కావడంతో పొత్తుల పంచాయతీ లెక్క తెగాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు సిట్టింగ్స్ వేయాల్సిందే అనీ అంటున్నారు. అయితే ఈ సిటింగ్స్ లో ఎన్ని రకాలుగా అవగాహనకు వచ్చినా టీడీపీ సీనియర్లు పలువురు రాజీ పడి తమ సీట్లను త్యాగం చేయక తప్పదని అంటున్నారు. మరో విషయం ఏంటి అంటే జనసేన వారాహి యాత్ర పూర్తి అయ్యేలోగా తాము పోటీ చేయబోయే ఆయా సీట్లకు ఇంచార్జిలను నియమిస్తారని అంటున్నారు. అదే జరిగితే జనసేన ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగానే ఉంటుంది అని అంటున్నారు.