టీడీపీ జనసేన పొత్తులో త్యాగరాజులయ్యేది ఎవరు...?

తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరింది. అగ్ర నేతలు అంతా బాగా సంతోషిస్తున్నారు. టీడీపీ నేతల ఆనందం అయితే చాలా ఎక్కువగా ఉంది

Update: 2023-11-27 03:45 GMT

తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరింది. అగ్ర నేతలు అంతా బాగా సంతోషిస్తున్నారు. టీడీపీ నేతల ఆనందం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ పెట్టుకున్నారు. ఆయన రెండు రోజులు స్మార్ట్ సిటీలో గడిపారు. ఈ సందర్భంగా ఒక హొటల్ లో పవన్ని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ అగ్ర నాయకులు అంతా కలిశారు.

పవన్ కూడా వారితో హుషారు చేస్తూ మాటా మంతీ పెట్టారు. టీడీపీ నాయకులు తీరు కొత్త అనుభవంగా ఉంది అని అంటున్నారు. చంద్రబాబు వచ్చినపుడు మాత్రమే టీడీపీ నాయకులు అంతా వెళ్ళి ఆయన్ని కలుస్తూ ఉంటారు. అలాంటిది మిత్రపక్షం నేత పవన్ వస్తే కట్టకట్టుకుని అంతా కలవడం అంటే టీడీపీ జనసేన పొత్తు పట్ల ఎంతటి జోష్ తో ఉందో అర్ధం అవుతోంది అని అంటున్నారు

అదే టైంలో పవన్ మనసులో మాటను తెలుసుకునేందుకు పొత్తు సీట్లలో తమవి పోకుండా ఉండేలా చూసుకునేందుకు కూడా కొందరు తమ్ముళ్ళు ఇలా వ్యవహరించారు అని అంటున్నారు. జనసేన ముందరి కాళ్ళకు బంధం వేసేలా కూడా తమ్ముళ్ళు కొందరు పవన్ తో మా నియోజకవర్గాలలో మీరు ప్రచారం చేయాలని కోరారని అంటున్నారు.

అంటే టీడీపీ తరఫున తామే అక్కడ అభ్యర్ధులుగా ఉంటామని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు. ఇక టీడీపీ నేతలతో పవన్ మాట్లాడుతూ ఏపీ విశాల ప్రయోజనాల రిత్యా యువత ఆశలు ఆకాంక్షల రిత్యా అంతా కలసి ముందుకు సాగాలని పదవులు సమస్య కారాదని అన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి.

పవన్ అన్నది ఏంటి ఆయన ఉద్దేశ్యం ఏంటి అన్నది పక్కన పెడితే జనసేన తానుగా సీట్లు త్యాగం చేస్తుంది అన్నట్లుగానే అర్ధం వచ్చేలా ప్రచారం మొదలైంది అని అంటున్నారు. నిజానికి టీడీపీ పొత్తు ద్వారా కనీసంగా యాభై సీట్ల దాకా జనసేన డిమాండ్ చేస్తుంది అని వార్తలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముప్పై సీట్లకు తగ్గకుండా జనసేన పోటీ చేస్తుంది అని కూడా మరో వైపు అంటున్న వారూ ఉన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేనకు కనీసంగా అరడజన్ సీట్ల మీద కన్ను ఉందని అంటున్నారు. అందులో బిగ్ షాట్స్ తో పాటు కీలక నేతల నియోజకవర్గాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆయా సీట్లలో పోటీకి తయారుగా ఉన్న టీడీపీ నేతలు కీలక నాయకులు అంతా పవన్ తో కలసి మీటింగులో ఉన్నారు.

దీంతో తమ నియోజకవర్గాలకు పొత్తు ద్వారా సీట్లు పోవని వారి అనుచరులు గట్టిగా చెప్పుకుంటున్నారు. మరి ఎవరి సీట్లూ పోకపోతే జనసేన కేవలం ప్రచారానికేనా అన్న డౌట్లు వస్తున్నాయి. జనసేనకు విశాఖలో ఆరేడు నియోజకవర్గాలలో మంచి బలం ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో పాతిక వేల దాకా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయని వాటిలో మళ్లీ జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ నార్త్, గాజువాక, భీమిలీ, పెందుర్తి, ఎలమంచిలి. అనకాపల్లిలలో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుంది అని అంటున్నారు. మరి ఇక్కడ టీడీపీ నుంచి పోటీలో మాజీ మంత్రులు సీనియర్ నేతలు ఉన్నారు. పవన్ చెప్పింది పదవులు వదులుకోవాలన్నది రెండు వైపుల నుంచి అని అంటున్న వారు ఉన్నారు. అయితే జనసేన త్యాగం చేస్తుందని ప్రచారం సాగడమే చిత్రం. మరి ఎన్నికల్లో సీట్ల షేరింగ్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News