124 ఏళ్ల రికార్డు బద్దలు.. ఈ ఫిబ్రవరి చాలా హాట్
గతానికి భిన్నంగా ఈ ఏడాది ఆరంభం నుంచే ఎండలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. సంక్రాంతి సందర్భంగా వాతావరణం చల్లగా ఉంటుంది.;
గతానికి భిన్నంగా ఈ ఏడాది ఆరంభం నుంచే ఎండలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. సంక్రాంతి సందర్భంగా వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకు భిన్నంగా ఈసారి సంక్రాంతి వేళకే ఎండ తీవ్రత అందరికి అనుభవంలోకి వచ్చిన పరిస్థితి. సంక్రాంతితో మొదలైన హీట్.. రోజు రోజుకు పెరగటమే కానీ తగ్గట్లేదు. ఈ కారణంతో ఫిబ్రవరిలో రోటీన్ కు భిన్నమైన వాతావరణం నెలకొందన్న అభిప్రాయం నెలకొంది.
ఈ వాదనకు బలం చేకూరేలా గణాంకాలు వెలువడ్డాయి. శివరాత్రి తర్వాత నుంచి మొదలయ్యే వేసవికి భిన్నంగా ఈ ఏడాది ఇప్పటికే వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే 124 ఏళ్ల నాటి రికార్డులు బద్ధలు కొట్టాయి. 124 ఏళ్లలో అత్యంత వేడి నెలగా ఈ ఫిబ్రవరి నిలిచింది. దీంతో కొత్త రికార్డు నమోదైంది. గత నెలలో సగటు 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి సగటు నమోదు కావటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. చరిత్రలోనే తొలిసారి ఈ ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీలకు పైనే నమోదై సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేశాయి. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతల విషయంలోనూ 2023 ఫిబ్రవరి రికార్డుల్ని సైతం దాదాపు అధిగమించిన పరిస్థితి. పర్యావరణ మార్పుల తాలుకూ విపరిణామాలకు ఈ ఉష్ణో ధోరణులు తాజా నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు.
గడిచిన రెండు దశాబ్దాల్లో అత్యంత వేడి దశాబ్దాలుగా రికార్డుల్ని క్రియేట్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తే తప్పించి.. రానున్న మూడు నెలల ఎండ తీవ్రత ఎక్కువ ఖాయమని. ప్రజలు ఇబ్బందులు ఖాయమన్న అంచనాను వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రానున్న మూడు నెలల హీట్ సమ్మర్ కు మెంటల్ గా.. ఫిజికల్ గా ప్రిపేర్ కావటం మంచిది.