రాజీనామా తర్వాత జీవీ రెడ్డి తొలి ట్వీట్.. చంద్రబాబు కోసం ఏమన్నారంటే..
టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ తొలిసారిగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. అది కూడా ఏపీ రాష్ట్ర బడ్జెటును ఉద్దేశించే జీవీ రెడ్డి స్పందిండం నెటిజన్లను ఆకర్షించింది.
టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ తొలిసారిగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. అది కూడా ఏపీ రాష్ట్ర బడ్జెటును ఉద్దేశించే జీవీ రెడ్డి స్పందిండం నెటిజన్లను ఆకర్షించింది. ఫైబర్ నెట్ చైర్మనుగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఆ పదవి నుంచి వైదొలగిన జీవీ రెడ్డి.. రాజకీయాలకు దూరమంటూ ప్రకటించారు. అయితే ఆయన తాజాగా చేసిన ట్వీట్ తో రాజకీయాలపై ఆయన ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు.
‘‘నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను.
ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను.’’ అంటూ జీవీ రెడ్డి రాసుకొచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబే కొనసాగాలంటూ ఆయన ఆకాంక్షించారు.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన జీవీ రెడ్డి.. సంస్థను ప్రక్షాళించేందుకు దూకుడుగా అడుగులు వేశారు. అయితే ఆయనకు అధికార యంత్రాంగం సహకరించలేదని చెప్పేవారు. సంస్థ నుంచి సక్రమంగా ఉద్యోగాల్లో చేరని వారిని తొలగిస్తూ జీవీ రెడ్డి తీసుకున్న నిర్ణయం అమలుకు నోచుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జీవీ రెడ్డి.. మీడియా ద్వారా అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఆయన చర్యను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ మీడియాలో ప్రభుత్వం పనితీరునే శంఖించేలా మాట్లాడటం పట్ల ప్రభుత్వ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఫలితంగా ఆయన పదవి కోల్పోవాల్సివచ్చింది. అటు ఆయనకు సహకరించని అధికారులపైనా ప్రభుత్వం వేటు వేసింది. మరోవైపు జీవీ రెడ్డి రాజీనామా పట్ల టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి.
జీవీ రెడ్డి పట్ల పార్టీలో విపరీతమైన సానుభూతి వ్యక్తమవుతోంది. దీంతో ఆయనను మళ్లీ టీడీపీలోకి తెచ్చేలా ప్రయత్నాలు మొదలయ్యాయంటున్నారు. ఇదే క్రమంలో జీవీ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా ట్వీట్ చేయడం ఆకర్షిస్తోంది. ఈ ట్వీట్ ద్వారా జీవీ రెడ్డి మెత్తబడినట్లేనని అంటున్నారు.