తెలంగాణలో రెండో ఎయిర్ పోర్ట్.. నిజాంల నాటి ‘వరంగల్ -మామునూర్’ కథ

మామునూర్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ సమీపంలో 1930లో స్థాపించబడింది. అప్పట్లో దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ప్రసిద్ధి పొందింది.;

Update: 2025-03-01 07:11 GMT

అది నిజాంలు పాలించిన రోజలు.. హైదరాబాద్ లోనే కాదు ఓరుగల్లులోనూ ఓ ఎయిర్ పోర్ట్ ను నిర్మించారు. భారత దేశంతో సహా విదేశాలకు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. దీనికో అద్భుతమైన చరిత్ర ముడిపడి ఉంది. కానీ స్వాతంత్ర్యం వచ్చాక ఈ ఎయిర్ పోర్టు మరుగనపడిపోయింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నే ప్రాచుర్యంలోకి వచ్చింది.

మామునూర్ ఎయిర్‌పోర్ట్, వరంగల్ సమీపంలో 1930లో స్థాపించబడింది. అప్పట్లో దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ప్రసిద్ధి పొందింది. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ విమానాశ్రయం, 1981 వరకు విమానాల రాకపోకలతో కళకళలాడింది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వ్యాపార ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించేవారు. అలాగే, రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు రాష్ట్ర పర్యటనల సమయంలో ఇక్కడే విమానాల నుంచి దిగేవారు. 1970లో ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ముప్పు ఉందని భావించి, విమానాల పార్కింగ్ కోసం మామునూర్‌లో పొడవాటి ఎయిర్‌షిప్ (హ్యాంగర్) నిర్మించారు.

తాజాగా మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో, గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న NOC సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. జీఎంఆర్ సంస్థతో సంప్రదింపులు జరిపి, బోర్డులో NOC ఇవ్వించేందుకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌కు లేఖ ద్వారా ఈ అనుమతిని తెలియజేశారు.

మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునర్నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానం, అభివృద్ధికి కీలక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దంగా నిలిచింది.

మొత్తం 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేయడం ద్వారా ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో మరింత ముందడుగు పడింది.

మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునర్నిర్మాణం ద్వారా, వరంగల్ , పరిసర ప్రాంతాల అభివృద్ధికి, వాణిజ్య, పర్యాటక రంగాల పురోగతికి సహకారం అందించనుంది.

Tags:    

Similar News