జెలెన్ స్కీకి తగిన శాస్తి జరిగింది.. రష్యాకు సంబరం

కోతి-కోతి తగువులాడుకుంటే మధ్యలో ఉన్న కుక్కకు ఆనందం అన్నట్టు ఇప్పుడు అమెరికా-ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వైరంతో రష్యా సంబురపడుతోంది.;

Update: 2025-03-01 07:48 GMT

కోతి-కోతి తగువులాడుకుంటే మధ్యలో ఉన్న కుక్కకు ఆనందం అన్నట్టు ఇప్పుడు అమెరికా-ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వైరంతో రష్యా సంబురపడుతోంది. ట్రంప్-జెలెన్ స్కీ మధ్య జరిగిన రచ్చను చూసి రష్యా ఎద్దేవా చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వాదం యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియా ఎదుటే జరిగిన ఈ ఘర్షణ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రభావం చూపింది. ఈ పరిణామాలపై రష్యా కఠిన పదజాలంతో స్పందించింది. రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్మన్‌ దిమిత్రి మెద్వెదేవ్‌ మాట్లాడుతూ, "ఉక్రెయిన్‌కు ఇది గట్టి చెంపదెబ్బ. జెలెన్‌స్కీకి ఇలా జరగాల్సిందే" అని వ్యాఖ్యానించారు.

రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ, "ఉక్రెయిన్‌ తమకు సహాయం చేసిన చేతినే గాయపరుస్తోంది. తమను ఆదుకున్న అమెరికాతోనే వాగ్వాదానికి దిగింది. అయినప్పటికీ ట్రంప్‌ అద్భుతమైన సంయమనం ప్రదర్శించారు" అని అన్నారు. రష్యా ఈ ఘటనను తమ వ్యూహానికి అనుకూలంగా మార్చుకునేలా ప్రదర్శించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

-అంతర్జాతీయ మద్దతు

ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు స్పందించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సహా పలు దేశాధినేతలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచారు. "కీవ్‌ ఒంటరి కాదు" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈ మద్దతుకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.

-ఘర్షణకు కారణమైన చర్చలు

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ముగింపు పలికి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి, అలాగే ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు జెలెన్‌స్కీ శ్వేతసౌధానికి వెళ్లారు. భవిష్యత్తులో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని అమెరికాపై ఒత్తిడి చేశారు. అయితే ఈ అంశాలు ట్రంప్‌కి ఆగ్రహాన్ని తెప్పించాయి. చివరకు చర్చలు అర్థంతరంగా ముగిశాయి. ఒప్పందంపై ఎలాంటి సంతకాలు చేయకుండా జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌ నుంచి బయటికొచ్చారు.

ఈ సంఘటన ప్రపంచ రాజకీయాలను మరింత వేడెక్కించనుంది. ఉక్రెయిన్‌-అమెరికా సంబంధాలు ఎంత వరకు ముందుకు సాగుతాయనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు దశకు చేరుతుందా, లేదా మరింత ముదురుతుందా అనేది ఈ పరిణామాల ద్వారా నిర్ణయించబడనుంది. ప్రపంచ రాజకీయ వర్గాలు దీనిపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

Tags:    

Similar News