రోజులో రూ.9 లక్షల కోట్లు.. 5 నెలల్లో రూ.94 లక్షల కోట్లు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.;
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా ఫస్ట్ పేరుతో తమకు తమ దేశం తప్పించి.. ప్రపంచ దేశాలతో సంబంధం లేదన్న విషయాన్ని ట్రంప్ అదే పనిగా స్పష్టం చేయటమే కాదు.. ఆ దిశగా రోజువారీగా తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రపంచం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. తాజాగా కెనడా.. మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ లను మార్చి నాలుగు నుంచి అమలు చేయనున్నట్లుగా ట్రంప్ స్పష్టం చేస్తున్నారు.
అదే సమయంలో చైనా మీద విధించిన పది శాతం పన్నుకు అదనంగా మరో పది శాతం టారిఫ్ విధిస్తున్నట్లుగా ట్రంప్ స్పష్టం చేయటం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. ఈ మొత్తం ప్రభావం మన స్టాక్ మార్కెట్ మీద పడంది. మన సూచీలు దారుణంగా క్షీణించాయి. ట్రంప్ అధికారంలో చేపట్టటానికి కాస్త ముందుగా మొదలైన పతనం.. అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తోంది. నిఫ్టీ వరుసగా ఎనిమిదో రోజు డీలా పడింది.
విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు మరింత పెరగటం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీశాయి. దేశీయంగా చూస్తే.. అక్టోబరు - డిసెంబరు త్రైమాసికానికి జీడీపీ వ్రద్ధి గణాంకాల విడుదల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తతో వ్యవహరించారు. దీంతో.. మార్కెట్ కు మరోసారి పతనాన్ని చూసింది. బ్లాక్ ఫ్రైడేగా మారిన ఈ శుక్రవారం ఒక్కరోజులో రూ.9 లక్షల కోట్ల మదుపర్లు సంపద ఆవిరైంది.
నిజానికి భారత స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగియగా.. ఐరోపా మార్కెట్లు ప్రతికూల ధోరణితో మొదలు కావటం గమనార్హం. బీఎస్ ఈలో నమోదిక కంపెనీల మార్కెట్ విలువ ఒక్క శుక్రవారం రూ.9,08,798.67 కోట్లు తగ్గింది. ఈ వారం మొత్తమ్మీదా రూ.20 లక్షల కోట్ల మేర మదుపర్లు సంపదనకు నష్టం వాటిల్లగా.. గడిచిన ఐదు నెలల్లో సాగుతున్న పతనం విలువ దాదాపు రూ.93.91 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ ఏడాదిలో సెన్సెక్స్.. నిప్టీకి ఒక రోజులో వచ్చిన అత్యధిక నష్టాలు ఇవే.
2024 సెప్టెంబరు 27న సెన్సెక్స్ 85,978 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకింది. అక్కడ నుంచి చూస్తే.. ఇప్పటికి 14.8 శాతం సూచీ నష్టపోయి 12,780 పాయింట్లకు పరిమితమైంది. నిఫ్టీ సైతం తన జీవిత కాల గరిష్ఠమైన 26,277 పాయింట్ల నుంచి 15.7 శాతం తగ్గింది.ఈ ఐదు నెలల్లో 4,152 పాయింట్లను కోల్పోయింది.
నిఫ్టీ 500 సుచీల్లో 148 కంపెనీల షేర్లు తాజా 52 వారాల కనిష్ఠానికి దిగి వచ్చాయి. 20 కంపెనీల షేర్లు 10-20 శాతం శ్రేణిలో నష్టపోయాయి. 318కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. మార్కెట్ ఇదే తీరు కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను రూపంలో రూ.80వేల కోట్లు వస్తాయని అంచనా వేశారని.. తాజా పరిణామాల్లో రూ.40వేల కోట్ల అంచనాల్ని అందుకోవటం కష్టమేనంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో 1-2 కోట్ల మంది మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తుండటం చూసతే.. ఎంత ఒత్తిడితో మార్కెట్ ఉందన్నది అర్థమవుతుందని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.