సంచలనాల స్కైప్ షట్ డౌన్.. కీలక నిర్ణయాన్ని తీసుకున్న మైక్రోసాఫ్ట్?

2000 దశకంలో సంచలనంగా మారటమే కాదు.. అనతికాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణకు నోచుకున్న ఈ వీడియో కాలింగ్ ప్రోగ్రాం తర్వాతి రోజుల్లో తన కళను కోల్పోవటం తెలిసిందే.

Update: 2025-03-01 05:14 GMT

టెక్నాలజీతో ఒక సమస్య ఉంది. ఒక కొత్త సాంకేతికతను క్రియేట్ చేయటం ఎంత కష్టమో..దాన్ని కంటిన్యూ చేయటం.. పోటీని తట్టుకొని నిలవటం అంత తేలికైన విషయం కాదు. అదిరే ఆరంభం ఉండే కొన్ని టెక్నాలజీలు తర్వాతి కాలంలో తగిన పోటీ ఇవ్వలేక కనుమరుగవుతుంటాయి. తాజాగా ఆ కోవలోకే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు చెందిన స్కైప్ కూడా చేరుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

2000 దశకంలో సంచలనంగా మారటమే కాదు.. అనతికాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణకు నోచుకున్న ఈ వీడియో కాలింగ్ ప్రోగ్రాం తర్వాతి రోజుల్లో తన కళను కోల్పోవటం తెలిసిందే. తాజాగా వస్తున్న పలు అంతర్జాతీయ కథనాల ప్రకారం స్కైప్ కు మైక్రోసాఫ్ట్ స్వస్తి పలకనున్నట్లుగా పేర్కొంటున్నాయి. అయితే.. సదరు సంస్థ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

స్కైప్ ప్రివ్యూలో ఒక హిడెన్ మెసేజ్ కనిపించింది. దాని సారాంశం ఏమంటే..ఈ ‘మే’ నుంచి స్కైప్ అందుబాటులో ఉండదు.. మీ కాల్స్.. చాట్స్ చేసుుకోవటానికి వీలుగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉందని పేర్కొంటూ.. ఇప్పటికే మీ మిత్రులు టిమ్స్ లోకి మారారు అని ఉన్నట్లు పేర్కొన్నారు. 2003లో ప్రారంభమైన స్కైప్.. స్వల్ప వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అప్పటివరకు విపరీతమైన ఖర్చుతో కూడుకున్న అంతర్జాతీయ కాల్స్ కు స్కైప్ బ్రేకులు వేసింది.

ఈ కారణంగానే 2011లో ఈ సంస్థను మైక్రోసాఫ్ట్ 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే.. దీనికి పోటీగా ఐమెసేజ్.. వాట్సాప్.. జూమ్ లాంటి యాప్స్ పుట్టుకురావటంతో ఇది తన పాపులార్టీని కోల్పోయింది. తర్వాతి దశల్లో వచ్చిన జూమ్.. గూగుల్ మీట్స్ స్థాయిలో స్కైప్ తనను తాను అప్ గ్రేడ్ చేసుకోకపోవటం.. ఇది తన అధిక్యతను కోల్పోయింది. ఈ నేపథ్యంలో స్కైప్ ను షట్ డౌన్ చేసి.. ఇప్పటికే తాము డెవలప్ చేసిన మీట్స్ ను మైక్రోసాఫ్ట్ ప్రమోట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

తాను డెవలప్ చేసిన మీట్స్ లో స్కైప్ కు మించిన మరిన్ని ఫీచర్లను మైక్రోసాఫ్ట్ జోడించింది. ఇటీవల కో పైలెట్ ఏఐ ఫీచర్లను కూడా జత చేసింది. అయితే.. స్కైప్ ను పూర్తిస్థాయిలో మైక్రోసాఫ్ట్ షట్ డౌన్ చేస్తుందా? లేదంటే మరో రూపంలో తీసుకువస్తుందా? అన్నది మాత్రం తేలట్లేదు. దీనిపై మైక్రోసాఫ్ట్ స్పందించాల్సి ఉంది. అప్పుడే పూర్తి స్పష్టత వచ్చే వీలుంది.

Tags:    

Similar News