ఢిల్లీ సర్కిల్స్ టాక్ : ఆ ఇద్దరు ఎంపీలూ ఏ పార్టీ సార్ ?

మన దేశంలో ప్రజా ప్రతినిధులు పార్టీ ద్వారా గెలుస్తారు. లేదా ఇండిపెండెంట్ గా గెలుస్తారు.

Update: 2024-10-13 12:30 GMT

మన దేశంలో ప్రజా ప్రతినిధులు పార్టీ ద్వారా గెలుస్తారు. లేదా ఇండిపెండెంట్ గా గెలుస్తారు. ఇక ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించేవారూ ఉన్నారు. కానీ ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ మీటింగులకు అటెండ్ కావడం అన్నది మాత్రం భలే తమాషా రాజకీయం అనే అంటున్నారు.

దేశంలో ఎక్కడ అలా జరిగిందో తెలియదు కానీ ఏపీలో మాత్రం ఆ తరహా పాలిటిక్స్ సాగుతూనే ఉన్నాయని అంటున్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేసినా పూర్వం పార్టీని పల్లెత్తు మాట అనకపోవడం, ఆ పార్టీ పెద్దలతో సాన్నిహిత్యాన్ని అలాగే కొనసాగించడం అన్నది ఏపీలోని కొందరు నేతలకే చెల్లింది అని అంటున్నారు.

ఏపీలో ఇద్దరు లోక్ సభ ఎంపీల వ్యవహార శైలి తీరు చూసిన వారు వీరు ఏ పార్టీ సార్ అని అనుకోవాల్సి వస్తోందిట. ఢిల్లీ సర్కిల్స్ లో ప్రత్యేకించి ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు అని కూడా అంటున్నారు. టీడీపీలో పుట్టి పెరిగి మూడు దశాబ్దాలకు పైగా బంధం పెంచుకున్న సీఎం రమేష్ అనే కడప జిల్లాకు చెందిన నాయకుడు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నుంచి బీజేపీలోకి మారిపోయారు. అపుడు ఆయన రాజ్యసభ ఎంపీ.

ఆ పదవీకాలం ఆయనకు ముగిసీ ముగియగానే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీతో నెగ్గారు. అయితే ఆయన టీడీపీ కూటమిలో బీజేపీ ఉండడంతో అధినేత చంద్రబాబుని పొగుడుతూ ఉంటారు. కూటమి సభలు జరిగినపుడు ఇది సహజం కూడా.

కానీ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతీసారీ సీఎం రమేష్ ఆయనకు స్వాగతం పలకడం ఆయన వెంటనే ఉండడాన్ని చాలా మంది చూసి చర్చించుకుంటున్నారుట. ఆఖరుకి ఇది ఎంతవరకూ వెళ్ళింది అంటే టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ఈ బీజేపీ ఎంపీ కూడా పాల్గొంటున్నారు అని ఢిల్లీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక చంద్రబాబు మీడియాను అడ్రస్ చేస్తే సరేసరి. ఆయనతో పాటే పక్కన ఉంటారని అందరికీ తెలుసు అంటున్నారు. ఇది కూటానుబంధం అని ఎంత చెప్పుకున్నా కూటమి ఉమ్మడి మీటింగులు కావు కదా అని అడిగే వారూ ఉన్నారు అంటున్నారు. అంతే కాదు టీడీపీ వేరే పార్టీ. తమ పార్టీ ఎంపీల కోసం సమావేశం నిర్వహిస్తే దానికో పాల్గొనడం అంటే అది టీడీపీకి ఓకే అయినా కమలం పార్టీకి నచ్చుతుందా అన్నది కూడా ప్రశ్నగా ఉంది అంటున్నారు.

ఈయన ఒక్కడే కాదు మరో ఎంపీ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయనే బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి అని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్ళి అక్కడ నుంచి గెలిచి వచ్చిన బాలశౌరి కూడా చంద్రబాబు ఢిల్లీ వచ్చినపుడల్లా ఆయనను రిసీవ్ చేసుకుంటూ ఆయన తో పాటే ఉంటున్నారు అని అంటున్నారు. ఈ ఎంపీ సైతం తెలుగుదేశం ఎంపీలతో కలసిపోయి వారితో పాటీ మీటింగులలో పాలు పంచుకుంటున్నారు అని అంటున్నారు.

దీనిని చూసిన టీడీపీ ఎంపీలే ఆశ్చర్యపోతున్నారుట. ఇంతకీ వీరు మన పార్టీయా లేక వేరే కండువా కప్పుకున్న ఎంపీలా అన్నది అసలు అర్ధం కావడం లేదుట. ఏది ఏమైనా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది. ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దాంతో ఏ ఎంపీ ఏ పార్టీ మీటింగులో పాల్గొంటేనేంటి. అంతా ఒక్కటే కదా అని అంటున్న వారూ ఉన్నారు. ఇది కూటానుబంధం పటిష్టమైన రాజకీయ బంధం అని కూడా చెబుతున్న వారూ ఉన్నారు. ఏది ఏమీ తప్పు అయితే కాదు కదా అని సర్దిచెప్పే వారూ ఉన్నారుట. సో వారు కూటమి ఎంపీలు అని పిలుచుకుంటే సరిపోదా వేరేగా పార్టీ ట్యాగులెందుకు అని సమర్ధించే వారూ ఉన్నారట. అదండీ మ్యాటర్.

Tags:    

Similar News