టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు!
ఈ సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. టీడీపీ - జనసేన పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ-జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన అనంతరం మరోసారి వీరి పొత్తులపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా బాగుండేది అనే మాటలు ఇప్పుడు ఆ సామాజికవర్గ ప్రజానికం నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా జనసైనికులైతే 24 అనగానే మండిపడుతున్నారు! ఈ సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. టీడీపీ - జనసేన పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... టీడీపీ - జనసేన కూటమి తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన అనంతరం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ ని చూస్తే జాలేస్తుందని ఒకరంటే... చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్.. కాపులను వెన్నుపోటు పొడిచారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తాజా రాజకీయ పరిస్థితులపై లక్ష్మీనారాయణ స్పందించారు. అధికారం కోసం ఎవరు ఎవరితో కలవడానికైనా రెడీ అయిపోతున్నారని అంటున్నారు!
ఇందులో భాగంగా... "రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.. జనసేన టీడీపీతో పొత్తు నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉంది" అని అన్నారు. ఇదే సమయంలో... పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఒప్పించి తమతో కలిసి పోటీ చేయిస్తే, జనసేన టీడీపీని వీడి బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ వైఖరి పైనా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో... పొత్తుల కోసం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో చివాట్లు తిన్నట్లు చెబుతున్న పవన్ కల్యాణ్... ఆ కష్టమేదో ప్రత్యేక హోదా కోసం పడి ఉంటే బాగుండెది అని అన్నారు. గతంలో తాను మూడో ప్రత్యామ్నయం అని చెప్పుకున్న ఆయన.. సడన్ గా చంద్రబాబుతో జతకట్టారని.. ఒకప్పుడు తానే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న వ్యక్తి.. దతనంతర కాలంలో తనకు అంత అనుభవం లేదనే వరకూ వ్యవహారం వచ్చిందన్నట్లుగా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు మాజీ జేడీ!
ఆ సంగతి అలా ఉంటే... పీకేని బీజేపీ ఒప్పించి.. టీడీపీతో తెగదెంపులు చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంటుందా అనేది ఆసక్తికరమైన అంశంగా ఉంది. వాస్తవానికి.. ఎన్నికలకు 50 రోజుల ముందు కూటమిని విచ్ఛిన్నం చేయడం ఆల్ మోస్ట్ అసాధ్యం అనే అనుకోవాలి. పైగా... అభ్యర్థుల మొదటి ఉమ్మడి జాబితా కూడా ప్రకటించిన తర్వాత ఇలాంటివి జరుగుతాయా అనేది మరో కీలక ప్రశ్న.
ఈ సమయంలో గతంలో పవన్ తో కలిసి ఉన్న లక్ష్మీ నారాయణ నుండి ఇలాంటి వాదన తెరపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కాగా... జనసేన పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీనారాయణ.. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీని వీడారు. అనంతరం ఇటీవల "జై భారత్ నేషనల్" పేరిట కొత్త పార్టీని ప్రకటించారు.