అమెరికాలో మాంద్యం... జేపీ మోర్గాన్ కీలక వ్యాఖ్యలు!
ప్రస్తుత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉందని జేపీ మోర్గాన్ చీఫ్ ఎకనమిస్ట్ మైఖేల్ ఫెరోలి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు
సాధారణంగా బలమైన దేశమైనా... ఎంత బలహీనదేశమైనా... మాంద్యం అంటే వణికిపోతుండటం సహజం! ఇక అగ్రరాజ్యం అయితే మరీ వణికీపోతుంటుంది. తేడా వస్తే తన అగ్రజత్వం పోతుందనే టెన్షన్ నిత్యం ఉంటుంటుంది. ఈ సమయంలో జేపీ మోర్గాన్ సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... మరోసారి మాద్యం వార్తలు తెరపైకి వచ్చాయి. పైగా... 2023లో అమెరికాలో మాంద్యం పరిస్థితులు తలెత్తబోతున్నాయంటూ ఫెరోలీ గతంలో అంచనా కూడా వేశారు. అయితే ఈ సమయంలో ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్... అమెరికాలో మాద్యం పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసింది.
అమెరికాలో ఈ ఏడాది మాంద్యానికి అవకాశం లేనట్లేనని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఈ మేరకు గత అంచనాలను సవరించింది. ప్రస్తుత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉందని జేపీ మోర్గాన్ చీఫ్ ఎకనమిస్ట్ మైఖేల్ ఫెరోలి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రొడక్టవిటీ పెరగడమే ఇందుకు కారణమని తెలిపారు.
అయితే మాంద్యం పరిస్థితులు ఇప్పటికిప్పుడు లేకున్నా.. పూర్తిగా ముప్పు తొలగిపోయిందని మాత్రం చెప్పడం లేదని ఫెరోలి పేర్కొనడం గమనార్హం. ఇందులో భాగంగా... 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు ఫెడ్ 11 సార్లు వడ్డీ రేట్లు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో వడ్డీ రేట్లు 5.25 శాతానికి చేరాయని తెలిపారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచకుంటే మాంద్యం పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తొచ్చని ఫెరోలి అభిప్రాయపడ్డారు.
కాగా... 2023లో అమెరికాలో మాంద్యం పరిస్థితులు తలెత్తబోతున్నాయంటూ ఫెరోలీ గతంలో అంచనా వేసిన సంగతి తెలిసిందే. రుణ పరిమితికి కాంగ్రెస్ లో అడ్డంకులు, బ్యాంకింగ్ సంక్షోభాలు తలెత్తడం వంటివి దీనికి కారణాలుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా తన అంచనాలను సవరించారు.