జస్టిస్ చంద్రచూడ్.. చివరి తీర్పూ సంచలనమే!
ఉత్తరప్రదేశ్‌లోని ఈ యూనివర్సిటీకి 'మైనారిటీ' హోదా విషయంలో సమస్య వచ్చింది. ఇది మూడు దశాబ్దాలకు పైగానే విచారణలో ఉంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఇటీవల కాలంలో సంచలన తీర్పులు ఇస్తు న్న విషయం తెలిసిందే. అదేసమయంలో రాజ్యాంగ బద్ధమైన విషయాల్లోనూ ఆయన విరివిగానే తీర్పు లు ఇస్తున్నారు. ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వాలకు పెద్దగా అధికారాలు ఉండవంటూ.. ఆయన నేతృత్వం లోని విస్తృత ధర్మాసనం రెండు రోజుల కిందట ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. దీనికి ముందు కూడా.. గవర్నర్ విస్తృత అధికారాలు, అసెంబ్లీ స్పీకర్ పరిధిని నిర్ణయిస్తూ.. వెలువరించిన తీర్పులు కూడా చరిత్ర సృష్టించాయి.
ఇలా తన నాయకత్వంలో సుప్రీంకోర్టు తీర్పులు.. సంచలనంగా ఉంటున్నాయన్న వాదన వినిపించేలా చేస్తున్నారు. ఇక, జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం శుక్రవారం(నవంబరు 8)తో ముగియనుంది. ఆయన ప్లేస్‌లో జస్టిస్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. చివరి రోజు కూడా.. జస్టిస్ చంద్రచూడ్ సంచ లన తీర్పు ఇవ్వడం ఆసక్తిగా మారింది. కొన్ని దశాబ్దాలుగా వివాదంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ విషయంలో జస్టిస్ చంద్రచూడ్ తీర్పు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఈ యూనివర్సిటీకి 'మైనారిటీ' హోదా విషయంలో సమస్య వచ్చింది. ఇది మూడు దశాబ్దాలకు పైగానే విచారణలో ఉంది. అయితే.. తాజాగా ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ రాజ్యాంగ పరమైన వివాదాన్ని తేల్చేసింది. ప్రధాన తీర్పు రాసిన జస్టిస్ చంద్రచూడ్.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదాను ఇవ్వడం అవసరమేనని తేల్చేశారు. అయితే.. ఈ తీర్పును ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు విభేదించడం గమనార్హం.
పాత తీర్పు..
వాస్తవానికి ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు సమయంలోనే దీనికి మైనారిటీ హోదా ఇచ్చారు. తద్వారా.. కేంద్ర ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. పైగా.. ఆ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు రిజర్వేషన్ పరిధి పెరుగుతుంది. అయితే.. 1967లో దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీకీ 'మైనారిటీ హోదా అవసరం లేదు' అని చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. 30 ఏళ్ల కిందట దాఖలైన పిటిషన్‌పై.. తాజాగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సంచలన తీర్పు ఇచ్చారు. ఆయన మరికొద్ది గంటల్లోనే రిటైర్డ్ కానున్నారు.