కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడేస్‌!

అయితే ఈ మూడింటి పనుల్లోనూ అవకతవకలు, నాణ్యతా లేమి చోటు చేసుకున్నాయి.

Update: 2024-03-05 06:26 GMT

తెలంగాణలోని గత కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పేరుతో ఎంతో అట్టహాసంగా, వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో పలు అవకతవకలు, నాణ్యతా లోపాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పనులు నాసిరకంగా ఉండటంతో వాటిలో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీకి నెర్రెలు ఇవ్వడం, పగుళ్లు రావడం జరిగాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపాలంటే ముందు దీనికి ఎగువన నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నింపాల్సి ఉంటుంది. అయితే ఈ మూడింటి పనుల్లోనూ అవకతవకలు, నాణ్యతా లేమి చోటు చేసుకున్నాయి. దీంతో వీటిలో నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేసే వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదని అంటున్నారు.

మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన పిల్లర్లు, నెర్రెలిచ్చిన గోడలకు మరమ్మతులు చేయాలంటే నాలుగు నెలల తర్వాతే సాధ్యమంటున్నారు. అన్నారం, సుందిళ్ల పరిస్థితి కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ బ్యారేజీల్లో నిల్వ చేసిన నీటిని వదిలేసి వాటిని ఖాళీ చేస్తున్నారు. నీటి నిల్వ అలాగే ఉండే బ్యారేజీ గోడలపై ఒత్తిడి పెరిగి.. ఏ క్షణమైనా అవి మరింత ప్రమాదకర స్థాయికి చేరొచ్చని ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్‌ నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నిల్వ ఉన్న నీటిని వదిలేసి బయటకు పంపుతున్నారు. ఈ బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో ఆరుగురితో నిపుణుల కమిటీని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ విధాన, పరిశోధన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ అమిత్‌ మిత్తల్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

నిపుణుల కమిటీ మూడు బ్యారేజీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఇందుకు నాలుగు నెలల గడువు విధించారు.

నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించి నివేదిక సమర్పించాకే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి ఆస్కారముందని ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు నెలలపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు హాలిడే ప్రకటించినట్లేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు జూలై తొలి వారం తర్వాతే బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. మరమ్మతులు చేపట్టాలంటే నిపుణుల కమిటీ సిఫారసులు, సూచనల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6న నిపుణుల కమిటీ బ్యారేజీల పరిశీలనకు రానుందని తెలుస్తోంది.

కాగా గతేడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీక్‌ అయ్యాయి. ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గతంలో ఎన్డీఎస్‌ఏ ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News