కమల్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదో తెలుసా?
దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ తమిళనాడులో జరుగుతున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ తమిళనాడులో జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో ఎలాగైనా సత్తాచాటాలంటూ బీజేపీ తీవ్రంగా కృషిచేస్తుండగా.. ద్రావిడ పాలనను కాదని బీజేపీకి అంత ఛాన్స్ ఇవ్వకూడదంటూ డీఎంకే బలంగా ఉంది! ఈ కీలక ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎం.ఎన్.ఎం) మాత్రం పోటీ చేయడం లేదు. ఈ రోజు ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అంతే..!
అవును... దక్షిణాదిలో తమ సత్తా చాటాలంటూ బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ, ఆ పాచికలు పారవంటూ డీఎంకే బలంగా నిలబడుతున్న సమయంలో కమల్ హాసన్ పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వాస్తవానికి ఈ విషయాన్ని కమల్ ఇప్పటికే వెల్లడించారు. తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య కూటమిలో కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యం పార్టీ కూడా చేరింది.
ఈ సమయంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తో కమల్ హాసన్ భేటీ అయ్యి లోక్ సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో... 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. దీంతో... ఈ లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో పోటీ నుంచి తప్పుకున్న ఎం.ఎన్.ఎం.... బయట నుంచి మద్దతు ప్రకటించింది.
నాడు ఆ సమయంలో స్పందించిన కమల్.. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో అప్పుడే స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా... దేశ ప్రయోజనాలను కాంక్షించి కూటమిలో చేరినట్లు చెబుతూ.. ఈ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని.. డీఎంకే - కాంగ్రెస్ కూటమికే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా... తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున కమల్ హాసన్ ఎం.ఎన్.ఎం పార్టీ ప్రచారం చేయనుంది.