పవన్ సార్.. మీ కోసం కనిగిరి వెయిటింగ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి ఎదురుచూస్తోంది. పవన్ వస్తేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని అక్కడి వారు డిప్యూటీ సీఎం కోసం నిరీక్షిస్తున్నారు.

Update: 2025-02-20 15:30 GMT

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి ఎదురుచూస్తోంది. పవన్ వస్తేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని అక్కడి వారు డిప్యూటీ సీఎం కోసం నిరీక్షిస్తున్నారు. తమ ఆవేదన, ఆందోళన తగ్గాలంటే డిప్యూటీ సీఎం పవన్ ఒక్కరి వల్లే అవుతుందని, ఆయన ఆసరాగా నిలిస్తేనే తమ జీవితాలు, ప్రాణాలు నిలుస్తాయని కనిగిరి వాసులు ఎదురుచూస్తున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో కిడ్నీ వ్యాధి తీవ్ర సమస్యగా మారుతోంది. ఫ్లోరైడ్ నీటి ప్రభావంతో కనిగిరి పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో వందల మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. కాళ్లు, చేతులు వంకరపోయి దివ్యాంగులుగా మారుతున్నారు. సరైన చికిత్స, వైద్యం ద్వారా వ్యాధి నయిం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. కనిగిరిలో డయాలసిస్ కేంద్రం ఉన్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఫ్లోరైడ్ నీటి సమస్యను అధిగమిస్తేనే కనిగిరిలో భవిష్యత్ తరాలకు భద్రత ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధులు కనిగిరి సమస్యపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మరోమారు ఈ అంశంపై చర్చకు తావిచ్చారు.

చాలా ఏళ్లుగా కనిగిరి వాసులను పీడిస్తున్న కిడ్నీ భూతం నయం కావాలంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాల్సిందేనని అభిప్రాయం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. కనిగిరిలో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ఉన్నారు. రోగుల సమస్యలపై ఆయన స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయి. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగితేనే కనిగిరి పట్టిన రోగం వదులుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. తమ బాధలను ప్రత్యక్షంగా చూసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకసారి కనిగిరి రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఇదే మాదిరిగా కిడ్నీ వ్యాధులు ఆ ప్రాంతాన్ని కకావికలం చేశాయి. అయితే 2014-19 మధ్య కాలంలో ఈ సమస్యపై ఫోకస్ చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ ఉద్దానంలో పర్యటించి, సమస్య తీవ్రతను అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పవన్ స్వయంగా ఉద్దానం వెళ్లి రోగులతో మాట్లాడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. సమస్య శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినా, కిడ్నీ రోగుల వెతలను చూసిన వైసీపీ సర్కారు కూడా ప్రత్యేక నిధులతో ఉద్దానం సమస్య రూపు మాపేందుకు ప్రయత్నించింది. ఇప్పుడిప్పుడే అక్కడ కిడ్నీ బాధితుల సంఖ్య తగ్గుతోందని అంటున్నారు. ఉద్దానంలో కిడ్నీ రోగానికి కారణం తొలినాళ్లలో అంతుబట్టని మిస్టరీగా ఉండేది. పవన్ పర్యటనతోనే నీళ్లే ఉద్దానం వాసులకు శాపంగా మారాయన్న విషయం బయటపడింది. ఇక కనిగిరిలో సమస్యకు మూలం తెలిసినా పరిష్కరించే మార్గం కనిపించడం లేదు. అందుకే పవన్ ఒకసారి వస్తే తమ తలరాత మారుతుందని కనిగిరి వాసులు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News