పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ ఫిర్యాదు.. రీజనేంటంటే!
ఈ సందర్భంగా తిరుపతిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీవ్యవస్థాపకుడు, ప్రపంచ శాంతి దూతగా పరిచయం చేసుకునే కిలారి ఆనందపాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులకు ఆయన 5 పేజీల పిర్యాదు పత్రాన్ని అందించారు. దీనిలో పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సనాతన ధర్మం పేరుతో సమాజంలో మత కల్లోలాలు సృష్టించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా తిరుపతిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.
భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్లు 192, 353, 240, 298, 299, 352, 351 (2), 351 (3), 302, 356, 356 (1), 61(2), 45, అదేవిధంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద పవన్‌పై కేసులు నమోదు చేయాలని కోరారు. మత కల్లోలాలను సృష్టించడం.. మతపరమైన వివాదాలను రెచ్చగొట్టడం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వమించిన వారాహి సభలో చట్టాలను ఉల్లంఘిస్తూ.. ప్రజలనురెచ్చగొట్టేలా ప్రసంగించారని తెలిపారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని.. ఇవి అయోధ్యకు కూడా పంపించారని.. దీనివల్ల సనాతన ధర్మం పై దాడి చేస్తున్నారని.. పేర్కొనడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ పవన్ కల్యాణ్ మతాల మధ్య, సమాజంలోనూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పాల్ తెలిపారు. వాస్తవానికి లడ్డూలను ల్యాబ్‌కు పంపించింది.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలోనేనని, ఆ నెయ్యి వినియోగించింది కూడా ఇప్పుడేనని.. కానీ, ఆయన మాత్రం గత వైసీపీ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అదేవిధంగా సుప్రీంకోర్టు ఏపీ సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ వ్యాఖ్యానించారని.. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పవన్పై కేసులు పెట్టి.. ఆయా సెక్షన్లను బనాయించాలని కోరారు. ఈ సందర్భంగా తాను ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవలను కూడా పాల్ పేర్కొనడం గమనార్హం.