విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పాల్ అమరణ దీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని కోరుతూ ప్రజా శాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ అమరణ దీక్షకు కూర్చున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని కోరుతూ ప్రజా శాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ అమరణ దీక్షకు కూర్చున్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన దీక్ష అయినా కేంద్రం కదలి రావాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ని తెగనమ్ముతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం విలువ ఎనిమిది లక్షల కోట్లు అని పాల్ పేర్కొన్నారు.
అటువంటి విలువైన ప్లాంట్ కి కేవలం నాలుగు వేల కోట్లకు ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రుడుకి అప్పగిస్తున్నారు అని ఆయన నిప్పులు చెరిగారు. దీనిని తాము అంగీకరించే ప్రసక్తి లేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని దాన్ని కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు
తనకు కనుక అవకాశం ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి లక్షల కోట్లు విరాళంగా తెచ్చి ప్రభుత్వ రంగంలో నిలబెడతాను అని కే ఏ పాల్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్లాంట్ కి వచ్చిన కేంద్ర ఉక్కు కార్మిక శాఖ అధికారులు సైతం ఉత్పత్తి మరో రెండేళ్ళలో నిలిచిపోతుందని అపశకునం పలికి వెళ్ళిపోయారు.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల తీరు కూడా ఒకేలా ఉంది. వామపక్షాలు మాత్రం గట్టిగానే ఉద్యమిస్తున్నాయి. అధికార వైసీపీ అయితే అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం అయితే చేసింది కానీ దీని మీద ప్రభుత్వ స్థాయిలో గట్టిగా పోరాడడం లేదన్న అసంతృప్తి అయితే కార్మిల లోకంలో ఉంది.
టీడీపీ సైతం పోరాటానికి మద్దతు అని చెబుతోంది కానీ ప్రత్యక్ష కార్యాచరణకి సిద్ధం కావడం లేదు అని అంటున్నారు. జనసేన సైతం తమకు అధికారం ఉంటే కేంద్ర పెద్దలతో మాట్లాడి ఉండేవారమని అంటోంది తప్ప మిత్రపక్షంగా చొరవను ప్రదర్శించడలేదు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని త్వరలో సందర్శించడం ద్వారా ఉక్కు కార్మిక ఉద్యమానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెబుతారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా కే ఏ పాల్ మాత్రం గట్టిగానే పోరాటానికి సిద్ధపడడం మాత్రం కార్మిక లోకం నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. పాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో మొదటి నుంచి ఒకే వాదన వినిపిస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు అమరణ దీక్షతో కే ఏ పాల్ మరో అడుగు ముందుకేశారు. నవ్విన చేనే పండుతుంది అన్నట్లుగా అన్ని రాజకీయ పార్టీలు కే ఏ పాల్ ని లైట్ గా తీసుకున్నా ఉక్కు ఉద్యమంలో ఆయన చూపుతున్న చొరవ మత్రం భేష్ అనేటట్టుగానే ఉందని అంటున్నారు. చూడాలి మరి పాల్ దీక్ష ఎంతదాకా వెళ్తుందో. ఏ రాజకీయ పార్టీలు కలసి వస్తాయో.