వైసీపీకి క‌ర‌ణం ఫ్యామిలీ దూరం.. దూరం!

ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన విష‌యం తెలిసిందే.

Update: 2024-07-15 04:01 GMT

ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పొందిన విష‌యం తెలిసిందే. 151 స్థానాల నుంచి 11 స్థానాల‌కు పార్టీ దిగ‌జారిపోయింది. దీంతో పార్టీ ఇక , కోలుకునే ప‌రిస్థితి లేద‌ని నాయ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 2019 ఎన్నిక‌లకు ముందు టీడీపీ నుంచి వైసీపీకి జంప్ చేసిన నాయ‌కులు తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూశారు. దీంతో వ‌చ్చే ఐదేళ్ల పాటు వారికి వైసీపీలో మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని అర్థ‌మైపోయింది. దీంతో ఇప్పుడు తిరిగిపాత గూటికి చేరుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.

ఫ‌లితంగా.. వైసీపీ నుంచి జారుకునే నాయ‌కుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి కుటుంబం.. వైసీపీకి రాం.. రాం.. చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమారుడు వెంక‌టేష్‌కు చీరాల టికెట్ ఇప్పించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. టీడీపీ అభ్య‌ర్థి కొండ‌య్య‌పై వెంక‌టేష్ చిత్తుగా ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టినుంచి క‌ర‌ణం కుటుంబం వైసీపీకి దూరంగా ఉంటోంది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌ల ప్ర‌కారం.. క‌ర‌ణం కుటుంబం త్వ‌ర‌లోనే తిరిగి టీడీపీలోకి వెళ్లిపోతుంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల‌తో బ‌ల‌రాం.. సైకిల్ ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తు న్నారు. స్థానికంగా కాంట్రాక్టు ప‌నులు చేస్తుండ‌డం.. వ్యాపారాలు, ఇత‌ర కేసుల్లోనూ ఉండ‌డంతో ఆయ‌న‌కు ఇప్పుడు అధికారికంగా మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ వైపు చూస్తున్నారు. అయితే.. చంద్ర‌బాబు ఏమేర‌కు ఆయ‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తార‌నేది చూడాలి.

ఎందుకంటే. 2019లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లోక‌ర‌ణం ఒక‌రు. ఆనాడు పార్టీని వీడొద్ద‌ని చంద్ర‌బాబు బ్రతిమాలినా.. క‌ర‌ణం వినిపించుకోలేదు. త‌న కుమారుడి భ‌విష్య‌త్తు అంటూ.. ఆయ‌న పార్టీ మారిపోయాయి. అయితే.. ఎక్క‌డా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం ఒక్క‌టే ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్న అంశం. మ‌రి ఏమేర‌కు ఆయ‌న‌కు చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పిస్తార‌నేది చూడాలి.

ఇదిలావుంటే.. వైసీపీ ఓట‌మి త‌ర్వాత ఆ పార్టీ నుంచి నాయ‌కులు జారుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే.. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు పార్టీకి రాజీనామా చేశారు. విజ‌య‌వాడ ఎంపీగా వైసీపీ టికెట్‌పై పోటీ చేసిన కేశినేని నాని కూడా రాజ‌కీయాల‌కు దూర‌మ‌ని ప్ర‌క‌టించారు. సినీ న‌టుడు అలీ కూడా.. వైసీపీకి రాజీనామా చేయ‌డంతోపాటు.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో చిత్తూరు కార్పొరేష‌న్ ఇప్ప‌టికే కూట‌మి వ‌శ‌మైంది. ఇప్పుడు గుంటూరులో కూడా.. కార్పొరేట‌ర్లు వైసీపీని వ‌దిలేస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News