కవిత రీ ఎంట్రీ... ప్రభుత్వం ముందు పెద్ద డిమాండ్

ఇక దీంతో కవిత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందరికీ అర్థమైంది. అందులో భాగంగానే తన భవిష్యత్ కార్యాచరణపై కూడా ప్రచారం జరిగింది.

Update: 2024-11-23 07:07 GMT

ఎట్టకేలకు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత రీ ఎంట్రీ ఇచ్చారు. జైలు నుంచి విడుదల అయ్యాక మూడు నెలల తరువాత మొదటి సారి ఆమె సమావేశం నిర్వహించారు. జాగృతి నేతలతో భేటీ అయిన ఆమె వచ్చీరాగానే ప్రభుత్వం ముందు పెద్ద డిమాండునే పెట్టారు.

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో ఆమెపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. దీంతో ఆమె 164 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఢిల్లీలోని తీహార్ జైలులో ఆమె ఉండిపోయారు. ఎట్టకేలకు ఆగస్టు 27న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు ఆ రోజు రానేవచ్చింది. ఇక ఆ వెంటనే హైదరాబాద్ చేరుకున్న కవిత ప్రజల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ.. ఆమె రానేలేదు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇక రేపు వస్తున్నారు.. ఎల్లుండి వస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుసుకోబోతున్నారంటూ ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ.. కవిత మూడు నెలలైనా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు.

రెండు రోజుల క్రితం అదానీపై అమెరికాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విషయమైన కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసుల విషయంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రధాని మోడీని నిలదీశారు. కేసులు నమోదవుతున్నా మోడీ ఎందుకు ఆదానీ వైపే నిలుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇక దీంతో కవిత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందరికీ అర్థమైంది. అందులో భాగంగానే తన భవిష్యత్ కార్యాచరణపై కూడా ప్రచారం జరిగింది.

ట్విట్టర్ వేదికగా మోడీని నిలదీసిన కవిత.. నిన్న జాగృతి కీలక నేతలతో సమావేశం నిర్వహించింది. జైలు నుంచి వచ్చాక ఆమె మొట్టమొదటి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కులగణన సర్వే నడుస్తోంది. ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఆమె రాష్ట్ర ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు. బడుగు, బలహీనవర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అన్నారు. సమాజంలో అంతరాలను రూపుమాపేందుకు, బలహీనవర్గాలను మరింత పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. బీసీలకు అన్నిరంగాల్లోనూ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోనూ సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణన సర్వే పకడ్బందీగా చేయించాలని డిమాండ్ చేశారు. కుల సర్వే, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిటీకి నివేదిక అందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి పలు డిమాండ్లు పెట్టిన కవిత.. సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. ఓ వైపు మీడియా, సోషల్ మీడియాలో నిత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే.. మరోవైపు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సంక్రాంతి నుంచే కేడర్‌తోనూ నిత్యం సమావేశాలు నిర్వహించబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఉమ్మడి నిజామాబాద్ నేతలతో ఆమె భేటీ అవుతున్నట్లు సమాచారం. నేతలతో పాటు కులసంఘాలతోనూ భేటీ కాబోతున్నారని ఆమె అనుచరుల నుంచి వస్తున్న ప్రచారం. మొత్తానికి కవిత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండడంతో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయా అన్న ఉత్కంఠ ఓ వైపు కనిపిస్తుంటే.. ఆమె అభిమానుల్లో మాత్రం సంతోషం మామూలుగా కనిపించడం లేదు.

Tags:    

Similar News