కష్టాలు తీరాలని మహాయాగం చేస్తోన్న కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ముందు నుంచీ దైవ భక్తి ఎక్కువ. దైవాన్ని చాలావరకు నమ్ముతుంటారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ముందు నుంచీ దైవ భక్తి ఎక్కువ. దైవాన్ని చాలావరకు నమ్ముతుంటారు. అందుకే.. ప్రతీ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ పాల్గొంటుంటారు. వీలు చిక్కినప్పుడల్లా యాగాలు సైతం చేస్తుంటారు. తన ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పూజలు, యాగాలు చేపడుతుంటారు.
గతంలో 2015లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చండీయాగం చేశారు. 2018లో మరో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు తనకు చెందిన ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగం చేశారు. అలాగే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 1 నుంచి మూడు రోజులపాటు రాజశ్యామల యాగం అని చేశారు.
కట్ చేస్తే.. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఆయనకు, ఆయన కుటుంబానికి ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో అటు న్యాయస్థానాల నుంచి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. అటు ఆయన తనయ సైతం లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఐదు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు.
ఇటు పార్టీ కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు ఉన్న లీడర్లు పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఒకప్పుడు పార్టీలో ముఖ్య పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ నుంచి తప్పుకున్నారు.
అయితే.. ఇటు బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండడం, అటు కేసులు చుట్టుముడుతుండడంతో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేదపండితుల సూచనల మేరకు తన ఫామ్‌హౌస్‌లో ఈ రోజు ఉదయం మరో యాగానికి పూనుకున్నారు. ప్రస్తుతం వస్తున్న అన్ని ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారట. ఇందులో కేసీఆర్ తనయ కవిత కూడా పాల్గొన్నారని తెలిసింది. మరి ఈ యాగం ఫలాలు కేసీఆర్‌కు ఎలా ఉండబోతున్నాయా చూద్దాం.