చంద్రబాబు జైలులో దోమలు.. కేసీఆర్‌ వీడియో వైరల్‌!

ఇప్పుడు టీడీపీ –వైసీపీ నేతల మధ్య తాజా విమర్శల నేపథ్యంలో కేసీఆర్‌ మాట్లాడిన ఆ వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతోంది.

Update: 2023-09-22 07:31 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఉండగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. మొదట్లో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. తాజాగా మరో రెండు రోజులపాటు రిమాండ్‌ ను ఏసీబీ కోర్టు పొడిగించింది.

మరోవైపు జైలులో చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కూడా లేవని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. స్నానానికి వేడి నీళ్లు లేవని, గదిలో ఏసీ లేదని, దోమలు ఎక్కువగా ఉన్నాయని, ఆయన నిద్రపోయే సమయంలో జైలు సిబ్బంది లాఠీలపై జైలు ఊచలపై కొడుతూ నిద్రాభంగం చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

తాజాగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒక ఖైదీ డెంగ్యూతో మృతి చెందడంతో చంద్రబాబును కూడా దోమలతో కుట్టించి చంపడానికి ప్రణాళిక వేశారని ఆరోపిస్తున్నారు. స్వయంగా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా సాక్షిగా ఇదే ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం జైలులో చంద్రబాబును పరామర్శించిన ఆయన సతీమణి భువనేశ్వరి సైతం జైలులో కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.

మరోవైపు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చనిపోయిన ఖైదీ జైలుకు రాకముందు నుంచే అనారోగ్యంతో బాధపడుతున్నాడని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అతడు డెంగ్యూ వల్ల మరణించలేదని అంటోంది. అనారోగ్యంతో చనిపోయినా దోమల వల్ల చనిపోయాడంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యుల మధ్య వివాదం ముదురుతోంది.

ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దోమలపై మాట్లాడిన వీడియో వైరల్‌ గా మారింది. "దోమ ఎంఎల్‌ఏ నైనా, మంత్రినైనా, ముఖ్యమంత్రిని అయినా కుడుతుంది. దోమకేమీ అడ్డం లేదు కదా.. ఎవరు ఎదురొస్తే వారిని కుడుతుంది. దోమ మంచి సోషలిస్టు.. దానికి తారతమ్యం లేదు. ఈయన మంత్రా, కాదా? సర్పంచా.. కాదా అని దోమ చూసి కుడుతుందా? దానికి ఏం తెలుసు?.. చెత్త ఉందంటే దోమ ఉంటుంది.. ఉందంటే కుడుతుంది.. కుట్టిందంటే ఏ మలేరియానో, మెదడు వాపు వ్యాధో వచ్చి దవాఖానాలో పడతాం" అంటూ కేసీఆర్‌ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.

ఇప్పుడు టీడీపీ –వైసీపీ నేతల మధ్య తాజా విమర్శల నేపథ్యంలో కేసీఆర్‌ మాట్లాడిన ఆ వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతోంది. వైసీపీ శ్రేణులు ఆ వీడియోను పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News