మోడీని కేసీఆర్‌ పొగిడినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు కేటీఆర్‌?

బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని.. రేవంత్‌ ప్రధాని పర్యటనలో పాలుపంచుకోవడమే ఇందుకు నిదర్శమన్నారు.

Update: 2024-03-06 06:51 GMT

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, అధికార కాంగ్రెస్‌ పార్టీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌.. ప్రధాని ఆదిలాబాద్‌ పర్యటనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీకి మరో హిమంత బిశ్వ శర్మలా అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని.. రేవంత్‌ ప్రధాని పర్యటనలో పాలుపంచుకోవడమే ఇందుకు నిదర్శమన్నారు.

అయితే కేటీఆర్‌ ఒక విషయాన్ని మరిచిపోయారు. 2014లో తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఒక దశలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరడానికి కూడా ప్రయత్నాలు చేశారు.

సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రధాని మోడీపై కేసీఆర్‌ అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్‌ ను అన్ని విధాల అభివృద్ధి చేసినందుకే మోడీ ప్రధాని కాగలిగారని కొనియాడారు. మోడీ ఎక్కడకు వెళ్లినా గుజరాత్‌ మోడల్‌ పైనే అంతా మాట్లాడుకునేలా చేశారని ప్రశంసించారు. ఈ ఒక్క సందర్భంలోనే కాదు చాలాసార్లు ప్రధాని మోడీపై కేసీఆర్‌ పొగడ్తల వర్షం కురిపించారు.

అయితే ప్రధాని మోదీతో కేసీఆర్‌ కు ఎక్కడ చెడిందో స్వయంగా ప్రధానే చెప్పారు. కేటీఆర్‌ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తాను.. మీరు సహకరించాలని కేసీఆర్‌ తనను కోరారని ప్రధాని మోడీ బాంబుపేల్చిన సంగతి తెలిసిందే. అలాగే తాను ఎన్డీయే కూటమిలో చేరతానని కూడా కేసీఆర్‌ చెప్పారని ప్రధాని మోడీ గతంలో తెలిపారు. అయితే తాను ఇందుకు ఒప్పుకోలేదన్నారు. ప్రజాస్వామ్యం రాచరికం కాదని కేసీఆర్‌ కు తెలిపానని మోడీ వివరించారు.

తన కొడుక్కి ముఖ్యమంత్రి పదవిని అప్పగించడానికి ప్రధాని సహకరించలేదు కాబట్టే అప్పటి నుంచి కేసీఆర్‌ తనపై కత్తిగట్టారని స్వయంగా ప్రధాని మోదీనే ఆరోపించారు. మొదట్లో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వాటిలో కేసీఆర్‌ కూడా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఎప్పుడయితే తన కుమారుడికి అధికారాన్ని బదిలీ చేస్తానని అడగడం.. అందుకు మోడీ ఒప్పుకోకపోవడంతో కేసీఆర్‌ లోని అహం నిద్రలేచిందనే విమర్శలు ఉన్నాయి.

ఇక అక్కడ నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడదోయగలిగేది తానేనని.. మోడీకి తానే దీటైన అభ్యర్థినంటూ కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకుని తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. వివిధ పార్టీల కీలక నేతలంతా కేసీఆర్‌ ను లైట్‌ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఓటమితో థర్డ్‌ ఫ్రంట్‌ ముచ్చట కూడా గాలికి కొట్టుకుపోయింది. అటు ఇండియా కూటమి కానీ, ఇటు ఎన్డీయే కూటమి కానీ ఆయనను దగ్గరకు తీయలేదు.

ఇప్పుడు తన కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బయటపడేసేందుకు బీజేపీకి కేసీఆర్‌ దగ్గరవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల దగ్గర నుంచి అన్ని విధాలా ఆ పార్టీకి దగ్గరవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇప్పుడు మాత్రం గురివింద గింజ తన కింద నలుపు ఎరగదన్నట్టు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ప్రధాని పర్యటనలో పాల్గొంటే దానిపైన కేసీఆర్, కేటీఆర్‌ నానా రచ్చ చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ధ్వజమెత్తారు. మీడియాతో తాజాగా చిట్‌ చాట్‌ లో మాట్లాడిన ఆయన ప్రధాని మోదీని పెద్దన్న అని సంభోదిస్తే తప్పేంటని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రయోజనాలకు ఆయన సహకరించాల్సి ఉందని.. ఆయన దేశ ప్రధాని అని.. అందుకే తాను పెద్దన్న అని సంబోధించానని రేవంత్‌ స్పష్టం చేశారు. తాను కేసీఆర్‌ లా గదిలో చెప్పలేదని.. బహిరంగంగా రాష్ట్ర ప్రయోజనాలపైనే అంతా మైక్‌ లోనే ప్రధానికి వివరించానన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ల మధ్య సీక్రెట్‌ ఫిక్సింగ్‌ ఉందని రేవంత్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. బీజేపీ మెదక్, బీఆర్‌ఎస్‌ చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడమే ఇందుకు నిదర్శమన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అంతర్గత ఒప్పందంతో సీట్లను ప్రకటిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలతో బీఎస్పీ కూడా కలిసిందని.. ప్రవీణ్‌ కుమార్‌ ముసుగు తొలగిపోయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో వస్తున్నాయని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడని.. కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదని.. అసెంబ్లీకి రానోడు ప్రతిపక్ష నేత ఎలా అవుతాడని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. ఐదు నెలల్లో తనను పదవి నుంచి దించుతానంటున్నారని మండిపడ్డారు. తనను దించాలంటే కేసీఆర్‌ మోదీతో కలవాలన్నారు.

తాను మోదీని పెద్దన్న అన్నందుకు రచ్చ చేస్తున్నారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాను అగ్రరాజ్యం అంటారని.. అదే మాదిరిగా ఆయన ప్రధాని కాబట్టి పెద్దన్న అన్నానని తెలిపారు. మోదీతో తాను అభివృద్ధిపై చర్చించానన్నారు. కేసీఆర్‌లా గదిలోకి వెళ్లి చెవిలో చెప్పలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి, ప్రయోజనాల కోసం ప్రధానిని కలిస్తే తప్పేంటని నిలదీశారు. తెలంగాణలో మోడీ, అమిత్‌ షా పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తామన్నారు.

తెలంగాణ సంపదను శ్రీమంతులకు ఎట్టి పరిస్థితుల్లో పంచబోమని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ట్యాక్స్‌ పేయర్స్‌ కు రైతుబంధు ఎందుకు..? అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గజ్వేల్, జన్‌ వాడ ఫాం హౌస్‌ రైతులకు రైతుబంధు ఇవ్వాలా? అని ప్రశ్నించారు.

అన్ని ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ జరుపుతామన్నారు. కేసీఆర్, లక్ష్మణ్‌ ఒకేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం పడిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు.

కాళేశ్వరంను ముంచిందే కేసీఆర్, హరీశ్‌ అని రేవంత్‌ ధ్వజమెత్తారు. మళ్లీ వాళ్ల సలహాలు ఎలా తీసుకోమంటారని నిలదీశారు. ఎవరైనా దొంగల సలహా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. నిపుణుల రిపోర్ట్‌ ప్రకారం కాళేశ్వరంపై ముందుకెళతామన్నారు.

కేసీఆర్‌ ను ప్రజలు ఓడించి రాజకీయంగా శిక్ష వేశారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ను బండకేసి కొట్టి బొంద పెట్టారన్నారు. కేసీఆర్‌ వందేళ్ల విధ్వంసం చేస్తే దాన్ని తాము వంద రోజుల్లో చక్కదిద్దామన్నారు. వచ్చే ఎన్నికలకు తమ 100 రోజుల పనితీరే కొలబద్దని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయరని రేవంత్‌ స్పష్టం చేశారు.

కాళేశ్వరంపై 4 వారాల్లో నివేదిక ఇస్తే.. ఎన్నికల లోపే చర్యలు తీసుకుంటామని రేవంత్‌ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి నిర్మించి ఆదిలాబాద్‌ కు నీళ్లు ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి ప్రభుత్వ శాఖల్లో సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేసీఆర్‌ చదివింది కేవలం బీఏనే అని.. పీజీ చేసినట్లు ఎన్నికల అఫిడవిట్‌ లో పేర్కొన్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని అభివృద్ధి చేయాలని అడుగుతాం తప్ప.. తమపై ప్రేమను చూపాలని మీలాగా అడగబోమని కేసీఆర్‌ పై మండిపడ్డారు.

Tags:    

Similar News