హోదా ఉన్నా రాని కేసీఆర్.. హోదా కోసం రాని జగన్!
ఏపీలో, తెలంగాణలో ఒకేసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
ఏపీలో, తెలంగాణలో ఒకేసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండుచోట్లా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీ పరిస్థితి కాస్త భిన్నం. అక్కడ చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలన్నరే అవుతోంది. అంతకుముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణలో మాత్రం ఓటాన్ అకౌంట్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకొచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, రెండు అసెంబ్లీల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది.
అక్కడా ఇక్కడా ‘విపక్షం’
ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 164 సీట్లు సాధించడంతో.. వైసీపీకి విపక్ష హోదాకు తగిన సంఖ్యలో సీట్లు సాధించే అవకాశం లేకపోయింది. అలిఖిత సంప్రదాయం ప్రకారం లోక్ సభ, శాసనసభల్లో ప్రతిపక్ష హోదా రావాలంటే ఆయా సభల్లోని మొత్తం సీట్ల సంఖ్యలో 10 శాతంపైగా సీట్లు సాధించాలి. ఈ లెక్కన ఏపీలో ప్రతిపక్ష హోదాకు 18 సీట్లు రావాలి. జగన్ పార్టీకి 11 మాత్రమే దక్కాయి. వాస్తవానికి ఇన్ని శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా కేటాయింపు అనేది లేకున్నా.. గతంలో నంచి వస్తున్న సంప్రదాయాన్ని దీనికి అన్వయిస్తూ వస్తున్నారు. వైసీపీ మాత్రం సాంకేతికంగా సభలో ప్రతిపక్షం తామే కాబట్టి తమకే ప్రతిపక్ష హోదా కావాలంటోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇదే డిమాండ్ ను ప్రస్తావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజునే.. రాష్ట్రంలో తమ పార్టీ వారిపై దాడులు జరుగుతున్నాయంటూ ఆయన ఢిల్లీలో ధర్నా చేశారు. విపక్ష హోదా లేకుంటే సభలో తమ గళం వినిపించే అవకాశం రాదంటూ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ వచ్చి వెళ్లారు..
తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. డిసెంబరు, ఫిబ్రవరిలో జరిగిన సమావేశాలకు గైర్హాజరైన ఆయన తాజాగా బడ్జెట్ సమావేశాలం తొలి రోజున తొలిసారిగా సభకు వచ్చారు. కాసేపు సభలో ఉండి వెళ్లిపోయారు. ఎన్నడూ లేనివిధంగా మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి సభ వైపే చూడలేదు. దీనిపై అధికార కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా కేసీఆర్ లెక్క చేయడం లేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణలో 39 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య ప్రకారం చూస్తే ప్రతిపక్ష హోదాకు 12 సీట్లు కావాలి. దీనికి రెట్టింపు సంఖ్యలో స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు.
హోదా ఉంటే..
విపక్ష నేత హోదా క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ తో సమానం. సభలో సీటు కేటాయింపులోనూ ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిపక్ష నేత హోదా లేకుంటే సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవాల్సి ఉంటుంది. కూటమి సర్కారులో ఈ పరిస్థితిని ఊహించిన జగన్ అసెంబ్లీకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనికితగ్గట్లే ఆయన కారణాలను చూపుతున్నారు. మరోవైపు తెలంగాణలో రేవంత్ సీఎం సీట్లో ఉండగా.. తనకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఊహించిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు ఇష్టపడడం లేదని స్పష్టమవుతోంది. కాగా.. తెలంగాణలో బీఆర్ఎస్ ను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది. సాంకేతికంగా బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వీరిలో 9 మందిని తీసివేయాలి. అంటే 29. మరో 10 మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం హోదా పోతుంది. కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు. ఈ అంసెబ్లీ సమావేశాలకు ముందే ఇదంతా జరుగుతుందని భావించినా.. సాధ్యం కాలేదు. పైగా ఒక ఎమ్మెల్యే (గద్వాల) తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు.