కేసీయర్ జోస్యం : కేంద్రంలో సంకీర్ణం...తెలంగాణాలో వచ్చేదేంటి....?
ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నాయి. జనాలు ఓటేసి గెలిపించాల్సింది ఎన్నుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని.
ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నాయి. జనాలు ఓటేసి గెలిపించాల్సింది ఎన్నుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ నెల 30న పోలింగ్ ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కేసీయార్ తెలంగాణా ఎన్నికల గురించి ప్రచారం చేస్తూనే కేంద్ర ఎన్నికల దాకా వెళ్ళిపోయారు. కేంద్రంలో ఈసారి వచ్చేది సంకీర్ణం అని కేసీయార్ అంటున్నారు.
ఈసారి ఏకపార్టీ పాలన రాదు గాక రాదు అని జోస్యం చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవాయే ఈసారి ఉంటుంది అని నొక్కి వక్కాణిస్తున్నారు. జాతీయ పార్టీలకు అంత ఊపు ఉండదని కూడా వివరిస్తున్నారు. కేసీయార్ సడెన్ గా కేంద్ర రాజకీయాలకు ఎందుకు వెళ్తున్నారు అన్నదే ఇపుడు చర్చ.
లోక్ సభ ఎన్నికలు మే నెలలో జరుగుతాయి. దానికి కావాల్సినంత టైం ఉంది. అప్పటికి ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు అపుడే చూసుకుంటారు. ఇపుడు కేసీయార్ ప్రభుత్వానికి రెన్యూవల్ ఇవ్వాలా లేక పక్కన పెట్టాలా అన్నదే ప్రజల ఆలోచన ప్రయారిటీగా ఉంటాయి.
మరి ఈ సంగతి తెలిసి కేసీయార్ జాతీయ రాజకీయాల వైపు ప్రజల ఆలోచనలను ఎందుకు నడిపిస్తున్నారు అన్నదే ప్రశ్న. అయితే ఇక్కడే కేసీయార్ వ్యూహం ఉంది అని అంటున్నారు. జాతీయ పార్టీలకు హవా ఉండదు కాబట్టి వాటిని తెచ్చి తెలంగాణాలో నెత్తిన పెట్టుకున్నా ఒరిగేది లేదు అని చెప్పడమే కేసీయార్ ఉద్దేశ్యం కాబోలు అని అంటున్నారు.
అదే విధంగా ఈసారి ప్రాంతీయ పార్టీలు అన్నీ కలసి కేంద్రంలో సంకీర్ణాన్ని తెస్తాయి. అలా బీయారెస్ పాత్ర కీలకం అవుతుందని చెప్పదలచుకున్నారు. అలా జరగాలంటే ముందు తెలంగాణాలో కూడా అధికారంలో బీయారెస్ ఉండాలి అని తిప్పి తిప్పి అలా చెబుతున్నారు అన్న మాట.
అయితే ఈ వ్యూహంతో పొరపాటు ఏంటి అంటే తనది ప్రాంతీయ పార్టీ అని కేసీయార్ చెప్పకనే ఒప్పేసుకోవడం. నిజంగా చూస్తే బీయారెస్ అని జాతీయ పార్టీ అనిఆ మధ్య దాకా కేసీయార్ హడావుడి చేశారు. కానీ తెలంగాణా ఎన్నికలలో మాత్రం ఆయన ఆయనతో పాటు కేటీయార్ హరీష్ రావు బీయారెస్ ని దాని పరిధిని కురచ చేసి పారేస్తున్నారు. ఆంధ్రోళ్ళకు తెలంగాణాతో ఏమి పని అన్నపుడు బీయారెస్ జాతీయ అస్తిత్వానికి కన్నం పడిపోయింది.
అంతే కాదు చంద్రబాబు అరెస్ట్ అయితే ఆయన మద్దతుదారులు తెలంగాణాలో ఎందుకు లొల్లి చేస్తారు అది ఆంధ్రాకు సంబంధించిన వ్యవహారం అని కేటీయార్ అన్నపుడే బీయారెస్ ప్రాంతీయ స్వభావం బయటపడింది. హరీష్ రావు కూడా అంతే. ఆంధ్రా వాదులు అంతా ఒక్కటిగా కలసి వస్తున్నారు అని వైఎస్ షర్మిలను, పవన్ కళ్యాణ్ లని విమర్శించినపుడే తెలంగాణా వాదం, ప్రాంతీయ సాయం బీయారెస్ కి ఎంత అవసరమో తెలిసి వచ్చాయి.
ఇక కేసీయార్ అయితే ఖమ్మం సభలో జాతీయ పార్టీలకు తెలంగాణాలో ఏమి పని అని ప్రశ్నించినపుడు తడబాటో పొరపాటో అనుకున్నారు. కానీ ఆయన ఇపుడు పదే పదే ప్రాంతీయ పార్టీలదే ముందున్న రోజులు అంటూ నినాదాలు వినిపించడంతో అచ్చమైన ప్రాంతీయ పార్టీగా బీయారెస్ ని ఉంచారని అర్ధం అవుతోంది. మరి ఈ ప్రాంతీయ వాదాలు తెలంగాణా సెంటిమెంట్లూ అన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేంతవరకేనా లేక ఆ తర్వాత మాది జాతీయ పార్టీ అని జెండా పట్టుకుని దేశమంతా తిరుగుతారా అంటే ఆలోచించాల్సిందే. అయితే జెండా పట్టుకుని ఏ రాష్ట్రం వెళ్ళినా ఈ ప్రాంతీయ నినాదాలను అక్కడ గుర్తు చేస్తే ఏమవుతుంది అన్నదే అసలైన ప్రశ్న.