విద్యుత్తు కమిషన్ పై సుప్రీం కు కేసీఆర్.. నేడే విచారణ..ఏం జరుగునో?
‘‘విద్యుత్తు కొనుగోళ్లు అన్నీ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) నిర్ణయం మేరకు ఉంటాయి.
‘‘విద్యుత్తు కొనుగోళ్లు అన్నీ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) నిర్ణయం మేరకు ఉంటాయి. అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఈఆర్సీ అనేది న్యాయబద్ధ సంస్థ. దాని మీద విచారణ కమిషన్ చెల్లదు అని పేర్కొంటూ తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ, దీనిని రద్దు చేయాలంటూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. కానీ, కమిషన్ నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నదని హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. అయితే, హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై సోమవారం సీజేఐ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై అక్రమాలు జరిగాయింటూ ప్రభుత్వం మార్చి 14న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
మార్చి 14 నుంచి జూలై 15 వరకు..
తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ లోని రమణ్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోళ్లకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు సంస్థలు వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోళ్లు చేశాయి. అయితే, లైన్లే లేకుండా ఈ ఒప్పందం చేసుకున్నారని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విచారణ చేపట్టింది. దీంతోపాటు భద్రాద్రి , యాదాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణంపైనా పలు అభియోగాలు చేసింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపించింది. కానీ.. ఇవన్నీ ఈఆర్సీ నిర్ణయాల మేరకే చేశామని.. వాటిని ప్రశ్నించే అధికారం లేదంటూ కేసీఆర్ జూన్ 24న హై కోర్టులో పిటిషన్ వేశారు. కానీ, దానిని కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.
కాగా.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై నిబద్ధతను తేల్చాలని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే, ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952, విద్యుత్తు చట్టం-2003కి విరుద్ధమని.. దాన్ని రద్దుచేయాలని కేసీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు. కొనుగోళ్లపై వివాదం ఉంటే.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలి తప్ప.. దానిపై విచారించే అధికారం కమిషన్ కు లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.