టీడీపీ కమ్మ వర్గానికి కేసీఆర్ గేలం.. ఏం చేస్తున్నారంటే!
వాస్తవానికి 2018 ఎన్నికల్లో కమ్మ వర్గం బీఆర్ ఎస్‌కు దూరంగా ఉంది. అప్పట్లో చంద్రబాబు-కాంగ్రెస్‌తో చేతులు కలిపి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో సారి కూడా విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్న బీఆర్ ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీకి చెందిన నాయకులకు గేలం వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన దరిమిలా.. కమ్మ వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందు కు కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు బీసీ నాయకుడు, టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో వైపు.. కమ్మ వర్గానికిచెందిన నాయకులను కూడా చేర్చుకుని ఆ వర్గం ఓట్లను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వాస్తవానికి 2018 ఎన్నికల్లో కమ్మ వర్గం బీఆర్ ఎస్‌కు దూరంగా ఉంది. అప్పట్లో చంద్రబాబు-కాంగ్రెస్‌తో చేతులు కలిపి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో అప్పట్లో ఆ వర్గం ఓట్లు బీఆర్ ఎస్‌కు పడలేదు. ఇక, ఇటీవల చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. ఇక్కడెందుకు గొడవ చేస్తారు. అది ఏపీ విషయం అక్కడే తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా కమ్మ వర్గానికి రుచించలేదు.పైగా ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే.. పోలీసులను ప్రయోగించారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న కమ్మవర్గాన్ని చేరదీయాల్సిన పరిస్థితి ఇప్పుడు కేసీఆర్‌కు వచ్చింది.
దీంతో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉందని ప్రకటించగానే ప్లేట్ మార్చేశారు. ఆ వెంటనే మంత్రి కేటీఆర్ నుంచి కేసీఆర్ తనయ కవిత వరకు చంద్రబాబుపై సానుభూతి పవనాలు కురిపించారు. ఇక, టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు కండువాలు కప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇలా తొలుత రెడ్డి నేతలను, తర్వాత కమ్మ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెడ్డి వర్గం నుంచి నాగం జనార్ధన్‌రెడ్డి(గతంలో టీడీపీ), రావుల చంద్రశేఖరరెడ్డి(టీడీపీ నుంచి బీఆర్ ఎస్‌కు వచ్చారు), ఎర్ర శేఖర్, కొత్తగూడెం నేత మాజీ మంత్రి కోనేరు సత్యనారాయణ(కమ్మం)తోపాటు ఇతర నేతలను చేర్చుకున్నారు.
తద్వారా టీడీపీ తమవైపే ఉందన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, కీలకమైన ఏపీ సరిహద్దు జిల్లాలు నల్లగొండ, ఖమ్మంలో టీడీపీ కి కేడర్ ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ కూడా 2014, 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఆయా వర్గాలను తనవైపు తిప్పు కొనే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. మొత్తానికి ఒకప్పుడు టీడీపీ అంటే ఏపీ ముద్ర వేసిన బీఆర్ ఎస్..ఇ ప్పుడు అదే పార్టీ నాయకులను తనవైపు తిప్పుకోవడం గమనార్హం.