తొలి జాబితా రిలీజ్ కి ముహూర్తం సెట్ చేసిన కేసీయార్...?

బీయారెస్ అధినేత కేసీయార్ రాజకీయ చాణక్యుడు. ఆయన వ్యూహాలు ఎపుడూ పదును తేరి ఉంటాయి.

Update: 2023-08-13 04:09 GMT

బీయారెస్ అధినేత కేసీయార్ రాజకీయ చాణక్యుడు. ఆయన వ్యూహాలు ఎపుడూ పదును తేరి ఉంటాయి. ప్రత్యర్ధులకు అందవు కూడా. అందుకే ఆయన హ్యాట్రిక్ విజయం కోసం అమలు చేస్తున్న వ్యూహాలు కూడా అటు సొంత పార్టీ వారికి సైతం అంతు పట్టకుండా టెన్షన్లో పెడుతున్నాయని అంటున్నారు. కేసీయార్ తొలి జాబితా రిలీజ్ ఫలానా డేట్ అంటూ జూన్ నుంచి ఇప్పటికి చాలా తేదీలు మార్చారు. అయితే ఇదంతా ప్రచారమే.

ఆఖరులు ఈ నెల 12 13 తేదీలలో తొలి జాబితా అంటూ హడావుడి జరిగినా అది ఈ రోజుకీ రిలీజ్ కాలేదు. ఇపుడు చూస్తే కొత్త తేదీ ఒకటి చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే సెప్టెంబర్ 6 అని అంటున్నారు. ఆ రోజున కేసీయార్ ఏకంగా 87 మంది అభ్యర్ధులతో తొలి జాబితా రిలీజ్ చేస్తారని అంటున్నారు. దానికి కారణం ఉంది 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కేసీయార్ సెప్టెంబర్ 7న తొలి జాబితా రిలీజ్ చేశారు.

అలా ఆయన అందరి కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించి కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. ప్రతిపక్షాలు తేరుకునేలోగానే ఆయన మొత్తానికి మొత్తం ఎన్నికల వాతావరణాన్ని సానుకూలంగా చేసుకున్నారు. ఈసారి కూడా అదే ట్రిక్ ప్లే చేయాలని మొదట అనుకున్నారు. అందుకోసం ఆయన ఏకంగా గత కొన్ని రోజులుగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో మంత్రులు కేటీయార్, హరీష్ రావులతో సమాలోచనలు జరుపుతూ వస్తున్నారు.

దాంతో ఆశావహులతో పాటు సిట్టింగులలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈసారి కేసీయార్ ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్ లిస్ట్ చూసిన తరువాతనే తన జాబితాను రిలీజ్ చేయాలని భావించే ఆగుతున్నారని అంటున్నారు

ఈ నెల చివరిలో కాంగ్రెస్ తొలి జాబితాగా 38 మంది అభ్యర్ధులతో వస్తుంది అని అంటున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ మొదటి వారంలో రెండవ జాబితా వస్తుందని అంటున్నారు. ఈ రెండు జాబితాలను చూసి ఆయా చోట్ల అభ్యర్ధులు ఎవరో లెక్క చూసుకుని అంచనా కట్టి మరీ తన జాబితాకు తుది మెరుగులు దిద్దాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈసారి 28 మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వరని ప్రచారం అయితే సాగుతోంది.

దాంతో ఎవరా 28 మంది అన్న చర్చ ఒక వైపు నడుస్తోంది. మరో వైపు చూస్తే కేసీయార్ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కేసీయార్ వ్యూహాలతో అటు ప్రత్యర్ధి పక్షాలనే కాదు సొంత పార్టీ వారికీ టెన్షన్ పుట్టిస్తున్నారు. అయితే ఈసారి కేసీయార్ దూకుడుకు అడ్డుపడుతున్నది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు.

కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా తెలంగాణాలో పెరిగిపోయింది. అనేక సర్వేలు సైతం ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న వేళ తొందరపడి తమ లిస్ట్ ముందుగా బయటపెడితే అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుందనే కేసీయార్ ఈసారి ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి సెప్టెంబర్ మొదటి వారానికల్లా అటు కాంగ్రెస్ ఇటు బీయారెస్ అభ్యర్ధులు దాదాపుగా ఎవరు అన్నది తేలిపోతుందని అంటున్నారు.

Tags:    

Similar News